దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎవరైనా దైవాన్ని దర్శించుకుని ఆ తరువాత కొబ్బరికాయ కొడతారు. ఏ ఆలయంలోనైనా ఇలాగే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి దైవాన్ని మొక్కితే అనుకున్నవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే గుజరాత్‌లో ఉన్న ఆ ఆలయంలో కొబ్బరి కాయను కొట్టాల్సిన పనిలేదు. ఆలయంలో ప్రతిష్టించబడిన ఆంజనేయ స్వామి విగ్రహం నోట్లో కొబ్బరికాయ పెడితే చాలు, ఆ కొబ్బరికాయ రెండు ముక్కలై బయటకు వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. దీన్ని చూసేందుకు, అలా కొబ్బరికాయను కొట్టేందుకు చాలా మంది భక్తులు ఆ ఆలయానికి వెళ్తుంటారు. ఇంతకీ… అసలు విషయం ఏమిటంటే…
అది గుజరాత్‌లోని సారంగాపూర్ జిల్లాలో ఉన్న హనుమాన్ ఆలయం. ఆ ఆలయంలో ఉన్న గర్భ గుడితోపాటు ప్రాంగణంలోనూ ఓ హనుమాన్ విగ్రహం ఉంటుంది. అయితే ఆవరణలో ఉన్న హనుమాన్ విగ్రహం నోట్లో కొబ్బరికాయ పెడితే అది రెండు ముక్కలై బయటకు వస్తుంది. చదివేందుకు వింతగా ఉన్నా ఈ విషయం నిజమే. అయితే కొబ్బరికాయ అలా రెండు ముక్కలు కావడం వెనుక ఏ అతీత శక్తీ లేదు. అది కేవలం అక్కడి మనుషుల ట్రిక్కే. భక్తులు ఆ హనుమాన్ విగ్రహం నోట్లో కొబ్బరికాయ పెట్టగానే అది రెండు ముక్కలు అయ్యేలా ముందే ఓ ప్రత్యేకమైన మిషన్‌ను ఆ విగ్రహంలో ఏర్పాటు చేశారు అక్కడి ఆలయ సిబ్బంది.
దీంతో ఎవరైనా ఆ విగ్రహం నోట్లో కొబ్బరికాయ పెట్టగానే అది ముక్కలై బయటకు వస్తుంది. అయితే ఆలయ సిబ్బంది అలా ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా..? భక్తులను ఆకర్షించడం కోసం మాత్రం కాదు. మరి ఎందుకు… అంటే… ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టే స్థలంలో శుభ్రత ఉండదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రదేశం అలా ఉండడం వల్ల ఆలయంలోనూ అదో రకంగా ఉంటుంది. దీని వల్ల భక్తులకూ చాలా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆలయంలో పరిశుభ్రతను పెంచడం కోసం ఆ ఆలయ సిబ్బంది అలా హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అవును మరి, ఆలయాలు అంటే స్వచ్ఛతకు, పరిశుభ్రతకు నిలయాలుగా ఉండాలి. అంతే కదా..! ఏది ఏమైనా ఇలాంటి వినూత్నమైన మిషన్ ఏర్పాటు చేసిన ఆ ఆలయ సిబ్బందికి అభినందనలు తెలపాల్సిందే కదా..!