అసలెంత చదివినా ఈ భగవద్గీత అర్థమవ్వట్లేదు.! అయినా ఈ భగవద్గీతను ఎందుకు చదవాలి? అని తాతను ప్రశ్నించాడో మనవడు. సమయం వచ్చినప్పుడు క్లియర్ గా చెబుతాలేరా…అన్నాడు.! ఆ రోజు రానే వచ్చింది…..ఓ రోజు మనవడిని తీసుకొని ఊరిబయటికి వెళ్ళాడు తాత…అక్కడ ఓ బొగ్గుల బట్టి ఉంది… కట్టెలు కాలి బొగ్గులుగా మారిన తర్వాత ఓ తట్ట ద్వారా బొగ్గును ఓ ముందే చదును చేసిన ప్రాంతానికి తీసుకెళుతున్నారు అక్కడ కూలీలు.! లంచ్ టైమ్ కావడంతో వాళ్ళంతా దగ్గర్లో ఉన్న చెట్టు దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు. దీంతో అక్కడే ఉన్న బాగా బొగ్గు మసి పట్టిన తట్టను మనవడికి ఇచ్చి….అదిగో కనిపించే వాగులోంచి నీరు తీసుకురా…అని చెప్పాడు.! అదెలా సాధ్యం తాత రంద్రాలున్నా ఈ తట్ట ద్వారా నీటిని ఎలా పట్టుకురాగలను? అని అన్నాడు మనవడు.. ఫర్వాలేదు వేగంగా రా…. అని సమాధానమిచ్చాడు.
మొదటి సారి:… 10 నిమిషాల్లో వచ్చాడు.! ఫలితం: తాత దగ్గరికి వచ్చే సరికి తట్టలోని నీళ్లు ఖాళీ…( ఫర్వాలేదు..ఈ సారి ఇంకాస్త వేగంగా వచ్చేయ్…అన్నాడు తాత.!) రెండవ సారి.….8 నిమిషాల్లో వచ్చాడు. ఫలితం: తాత దగ్గరికి వచ్చే సరికి తట్టలోని నీళ్లు ఖాళీ.( ఇంకాస్త వేగం పెంచోయ్ అన్నాడు తాత.)
మూడవసారి …5 నిమిషాల్లో వచ్చాడు. ఫలితం: నీళ్లు ఖాళీ… ఇలా 5 సార్లు చేశాక…విసుగుతో…ఇక నేను తేను తాత…..ఎంత తెచ్చినా..ఎంత ప్రయత్నం చేసినా వేస్టే..ఇక్కడికొచ్చే వరకు ఆ నీళ్లు ఉండడం లేదన్నాడు మనవడు! అప్పుడు తాత ఓ సారి ఆ తట్టను చూడు మనవడా? అన్నాడు…చూశాడు మనవడు..ఏం అర్థమైంది అన్నాడు తాత…ఏమర్థంకాలేదన్నట్టు తలూపాడు మనవడు..!
అప్పుడు తాత…. మొదట ఈ తట్ట బొగ్గు మసితో మొత్తం నల్లగా ఉంది, నీవు ఈతట్టతోనే నీళ్లు మోసుకురావడం చేత….. క్రమంగా మసంతా పోయి…ఇప్పుడు చూడు కొత్త తట్టలాగా ఎంత శుభ్రంగా ఉందో- అలాగే భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే..అర్థమవ్వనీ అవ్వకపోనీ, గుర్తుండనీ, ఉండకపోనీ…భగవద్గీత చదివే క్రమంలో మన ఆలోచనల్లో, మన దృక్పథంలో మనకు తెలియకుండానే ఓ మంచి మార్పు వస్తుంది. అది వెంటనే తెలియదు సందర్భాన్ని బట్టి అది బయటపడుతుంది. మనకు మంచి చేకూర్చుతుంది.!. అన్నాడు.