ప్రస్తుత తరుణంలో ప్రయాణాలు చేసే వారెవరైనా ఎక్కడికి వెళ్తున్నా, ఎలా వెళ్తున్నాం, టిక్కెట్లు బుక్ చేస్తే రిజర్వేషన్ ఉందా..? బస్సులోనా, రైళ్లోనా..? వంటి అనేక విషయాల్లో ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అది మంచిదే. అయితే వెనుకటి రోజుల్లో అలా కాదు, ప్రయాణం చేస్తున్నారంటే అంతకు కొన్ని రోజుల ముందే ప్రయాణపు ముహుర్తాన్ని కూడా నిర్ణయించేవారు. ఫలానా తేదీ, ఫలానా రోజున, ఫలానా టైముకు వెళ్లాలి, అని ముందుగానే నిశ్చయించుకుని ప్రయాణం చేసేవారు. దీంతో ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు కలగవని, సురక్షితంగా గమ్యస్థానం చేరతామని మన పెద్దలు భావించేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి పద్ధతులను పాటించే వారు చాలా తక్కువయ్యారు. ఈ క్రమంలో అసలు మన పెద్దలు పాటించిన పద్ధతి, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం… అసలు ఏ రోజున ప్రయాణం చేస్తే మంచిది..? ఏ రోజున ఎటు వైపు ప్రయాణం చేయాలి..? ఏయే తిథులు, లగ్నాల్లో ప్రయాణం చేయాలి..? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఎవరికైనా సోమ, బుధ, గురు, శుక్ర వారాలు ప్రయాణానికి అనుకూలమైనవట. ఇక మిగిలిన రోజులైన ఆది, మంగళ, శని వారాల్లో ప్రయాణాలు చేయకూడదట. ద్వాదశి, అష్టమి, షష్టి ఉన్నప్పుడు ప్రయాణం చేయకూడదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర నక్షత్రాలు ఉన్నప్పుడు ప్రయాణం చేయరాదు. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశిలను ప్రయాణానికి శుభ తిథులుగా భావిస్తారు. ఈ తిథుల్లో ఎవరైనా ప్రయాణం చేయవచ్చు.
నక్షత్రాల విషయానికి వస్తే అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణింపబడుతున్నాయి. ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా ప్రయాణాలు చేయవచ్చు. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం లు శుభ లగ్నాలుగా చెప్పబడుతున్నాయి. కనుక ఈ లగ్నాలు ఉన్నప్పుడు కూడా ప్రయాణాలు చేయవచ్చు. భయం లేదు. సోమవారం తూర్పు దిశకు, బుధవారం ఉత్తర దిక్కుకు, గురువారం దక్షిణ దిక్కునకు, శుక్ర వారం పశ్చిమ దిశకు ప్రయాణం చేయకూడదు. శూల కలుగుతుంది. అనుకోని అవాంతరాలు వచ్చి పడతాయి. పనులకు ఆటంకం కలుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కావు.