సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా పండుగల సమయంలో దేవాలయంలో లేదా మన ఇంటిలో కలశం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కలశంపై కొబ్బరికాయను పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా కలశంపై కేవలం కొబ్బరికాయను పెట్టడానికి గల కారణం ఏమిటో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంట్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములు చేసేటప్పుడు కలశం పెట్టడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయని భావిస్తారు. అయితే కలశంపై కొబ్బరి కాయను పెట్టడానికి గల కారణం.. ఈ విశ్వం మొత్తానికి కొబ్బరికాయ మరో రూపంగా భావిస్తారు. సకల దేవతలు ఉన్న ఈ విశ్వానికి మరో ప్రతీక అయిన కొబ్బరికాయ ఆ దేవుళ్ళ అంశం కలిగి ఉంటుందని భావించడం వల్ల శుభకార్యాలు, పూజా సమయాలలో కలశంపై కొబ్బరికాయలను ప్రతిష్టిస్తారు.
ఈ విధంగా కలశంపై ప్రతిష్టించిన కొబ్బరికాయను పూజ అనంతరం బ్రాహ్మణుడికి ఇచ్చి పాదాభివందనం చేయడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయి. బ్రాహ్మణులు లేనిపక్షంలో ఆ కొబ్బరికాయను పారుతున్న కాలువలో వేయటం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.