ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా హోలీ పండుగ వచ్చేసింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. గతంలో నార్త్ ఇండియన్స్ మాత్రమే ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు. కానీ గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇప్పుడు దేశంలోని అందరూ హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రకరకాల రంగులను మీద చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. అయితే హోలీ అంటే యువతకు ముందుగా గుర్తుకు వచ్చేది భంగు. హోలీ రోజు కచ్చితంగా భంగును తాగుతారు. ఇది అందుబాటులో లేకపోతే మద్యం సేవిస్తారు. అయితే హోలీ నాడు భంగును ఎందుకు సేవిస్తారో తెలుసా..? ఈ విషయాన్నే ఇప్పుడు తెలుసుకుందాం.
భంగు సేవించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంగా ఉంది. నిత్యం ఎన్నో ఒత్తిళ్లతో సతమతం అయ్యేవారు కనీసం ఆ ఒక్క రోజు అయినా భంగు సేవించి ఉత్సాహంగా గడుపుతారని, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారని, అందుకోసమే భంగు తాగాలని చెబుతారు. ఇక హోలీ పండుగ నాడే శివుడు తన కుటుంబ సభ్యులను కలిశాడని, కనుకనే దానికి గుర్తుగా, స్వేచ్ఛకు చిహ్నంగా కూడా భంగును సేవిస్తారు. అయితే భంగు అంటే మజ్జిగనే. కాకపోతే అందులో గంజాయి కలుపుతారు. కానీ మన దేశంలో గంజాయి సేవించడం చట్ట రీత్యా నేరం. కనుక భంగును చాలా మంది అమ్మరు. కాబట్టే ఆ రోజు మద్యం సేవించేందుకు ఉత్సాహం చూపిస్తారు.
ఇక ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే భంగును సేవించడం వల్ల ఆకలి పెరుగుతుందట. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందట. అలాగే కొన్ని వర్గాల వారు భంగును సేవించడం వల్ల ఆత్మ పరిశుద్ధం అవుతుందని నమ్ముతారు. ఈ కారణాల వల్లే భంగును సేవించడం ఆనవాయితీగా వస్తోంది.