ఆధ్యాత్మికం

దర్భ‌ల‌ను అంత ప‌విత్రంగా ఎందుకు భావిస్తారు..? వీటి విశేషాలు ఏమిటి..?

హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి అంటే శుభం, లేదా అశుభం ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా దర్భలు వాడుతారు. యజ్ఞయాగాదుల్లో దర్భలను వాడుతారు. నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి , దేవతాప్రతిష్ఠల వరకు దర్భలేనిదే కార్యక్రమం జరుగదు. ఈ దర్భల విశేషాలు తెలుసుకుందాం. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు శ్రీ రాముని స్పర్శ చేత పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది. ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి వుంచడం గమనించవచ్చును. ధర్భలని సంస్కృతం లో అగ్ని గర్భం అంటారు. కుంభాభిషేకాలలోను యాగశాలలోని కలశాలలోను, బంగారు, వెండి తీగలతో పాటుగా ధర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.

ధర్భలలో కూడా స్త్రీ, పురుష , నపుంసక జాతి ధర్భలని మూడు రకాలు వున్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరికొసదాకా సమానంగా వుంటాయి. పై భాగంలో దళసరిగా వుంటే అది స్త్రీ ధర్భ గా గుర్తిస్తారు. అడుగున దళసరిగా వున్న ధర్భను నపుంసక ధర్భ గా తెలుసుకోవచ్చును. ధర్భల దిగువ భాగంలో బ్రహ్మకు , మధ్యస్థానంలో మహావిష్ణువుకు , శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు. వైదికకార్యాలలో పవిత్రం అనే పేరుతో ధర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు .

why darbha became very sacred

ఈ వ్రేలిలో కఫనాడి వుండడం వలన యీ ఉంగర ధారణవలన కఫం శుభ్రం చేయబడుతోంది. ప్రేత కార్యాలలో ఒక ధర్భతోను, శుభ కార్యాలలో రెండు ధర్భలతోను, పితృ కార్యాలలో మూడు ధర్భలతోను, దేవ కార్యాలలో నాలుగు ధర్భలతోను, ఆ ధర్భ ఉంగరాన్ని ముడి వేస్తారు. దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం వంటి కార్యాలలో ధర్భతో చేసిన పవిత్రం అనే యీ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.

ఆదివారంనాడు కోసిన ధర్భలను ఒక వారంపాటు ఉపయోగించవచ్చును. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును. పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చును. శ్రావణమాసంలో కోసిన ధర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చును. భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరుమాసాలు ఉపయోగించ వచ్చును. శ్రాధ్ధ కార్యాల కోసం తెచ్చిన ధర్భలను ఏ రోజు కా రోజే ఉపయోగించాలి. ప్రస్తుత కాలంలో ఎక్కువగా వాడే దర్భలను వశిష్ట దర్భ లేదా విశ్వామిత్ర దర్భలుగా పిలుస్తుంటారు. ఏది ఏమైనా ఈ దర్భలకు అనేక విశేషాలు ఉన్నాయి.

Admin

Recent Posts