ఆ పరమశివుడిని అభిషేక ప్రియుడు పిలుస్తారు.భక్తులు కోరిన కోరికలు నెరవేరాలంటే పరమేశ్వరుడికి దోసెడు నీటితో అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే చాలు స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలను నెరవెరుస్తాడు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుంది. అయితే బిల్వ దళాలు అంటే స్వామి వారికి ఎందుకు అంత ప్రీతికరమో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం సాగరమధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి హాలాహలం ఉద్భవించింది.అయితే పరమశివుడు ఆ విషాన్ని సేవించి సమస్త ప్రాణికోటిని కాపాడాడు. ఈ విధంగా విషం తాగడం చేత శివుడి తల భాగం మొత్తం వేడెక్కింది.ఈ క్రమంలోనే పరమశివుని చల్లబరచడం కోసం దేవతలందరూ శివుడి తలపై నీటితో అభిషేకం చేశారు.అదేవిధంగా బిల్వదళాలకు చల్లదనం ఇచ్చే గుణం ఉండటం వల్ల బిల్వ దళాలను సమర్పించారు.బిల్వ పత్రాలు సమర్పించిన తర్వాత పరమశివుడు ఉపశమనం పొందటంతో అప్పటినుంచి శివపూజలో బిల్వ దళాలకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పిస్తే తప్పకుండా వారి కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే బిల్వ దళాలను సమర్పించే టప్పుడు తొడిమతో సహా సమర్పించాలి. అదేవిధంగా బిల్వపత్రాలను శివుడికి ఎల్లప్పుడు తలక్రిందులుగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.