Lord Shani Dev : శనిదేవుడుని న్యాయ దేవుడు, కర్మ దేవుడు మరియు గ్రహాల రాజుగా పరిగణిస్తారు. తొమ్మిది గ్రహాలల్లో శని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది. అయితే శనిదేవుడి పేరు వినగానే ప్రజలు భయాందోళనలకు గురి అవుతారు. ఎందుకంటే శని దేవుడు కఠినమైన శిక్షలను ఇస్తాడని ప్రజలు నమ్ముతారు. కానీ శనిదేవుడి శిక్షించడంతో పాటు కర్మల ఫలాలను కూడా ఇస్తాడు. మీరు మంచి చేస్తే మంచి ఫలితాలను అనగా సంతోషాన్ని, ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తాడు. అదే మీరు చెడు పనులు చేస్తే శిక్షలను విధిస్తాడు. శని దేవుడు ఒక న్యాయమూర్తి వలె మన కర్మ ఫలాలను మనకు అందిస్తాడు. ఇక శనివారం శనిదేవుడికి అంకింతం చేయబడింది. శనిదేవునికి నూనెను సమర్పించడం వల్ల మనం కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
శనిదేవుడికి నూనెను సమర్పించినప్పటికి చాలా మందికి దీని వెనుక ఉండే కారణం తెలియదు. అసలు శనిదేవుడికి నూనెను ఎందుకు సమర్పిస్తారు..? దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత, పురాణాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హనుమంతుని యొక్క శక్తి సామార్థ్యాలను శని దేవుడు తెలుసుకున్నాడు. శని దేవుడికి అతని బలం, శక్తి గురించి ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవాడు. దీంతో శనిదేవుడు హనుమంతుడితో పోరాడడానికి వెళ్లాడు. శనిదేవుడు వెళ్లేసరికి హనమతుండు ఒక చోట కళ్లు మూసుకుని రామ నామాన్ని జపిస్తూ ఉన్నాడు. కానీ అహంకార మత్తుతో శనిదేవుడు హనుమంతుడిపై యుద్దానికి సవాలు చేశాడు. దీంతో హనుమంతుడు శనిదేవుడితో నేను భక్తిలో మునిగి ఉన్నాను ఇప్పుడు యుద్దం చేయడం సరికాదని వివరించాడు. అయినప్పటికి శనిదేవుడు వినలేదు. దీంతో హనుమంతుడు కూడా యుద్దానికి సిద్దం అయ్యాడు. యుద్దం జరిగేటప్పుడు హనుమంతుడు శనిదేవుడిని తన తోకలో చుట్టి రాళ్లపై పదే పదే విసిరాడు.
దీంతో శనిదేవుడు తీవ్రంగా గాయపడి హనుమంతుడిని క్షమాపణలు కోరాడు. ఇక అప్పటి నుండి హనుమంతుడి భక్తులపై, రాముడి భక్తులపై శనిదేవుడు ఆశీర్వాదాలను కురిపించడంతో పాటు వారిని ఎప్పటికి ఇబ్బందులకు గురి చేయనని చెప్పాడు. యుద్దం ముగిసిన తరువాత శనిదేవుడు చాలా బాధకు గురిఅయ్యాడు. ఈ బాధను చూడలేని హనుమంతుడు శనిదేవుడికి నూనెను ఇచ్చాడు. ఆ నూనెను పూయగానే శనిదేవుడి బాధ తగ్గింది. ఇక అప్పటి నుండి శనిదేవుడికి నూనెను నైవేధ్యంగా పెట్టడం ప్రారంభించారు. శనిదేవుడికి నూనెను సమర్పించడం వెనుక ఉన్న పురాణా గాధ ఇది.