కాబా షరీఫ్ కు వేలాది సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. వేల సంవత్సరాల క్రితం భూమి మీద మొట్టమొదటి మానవుడు అయిన ఆదం (అలైహిస్సలాం) చేత మొదటగా బంజరు భూమిలో, ఇసుకా రాళ్లతో నిర్మాణం గావించబడింది. కురాన్ లో దీని గురించిన ప్రస్తావన ఉంది. మానవజాతి కోసం నిర్మింపబడిన మొట్టమొదటి కట్టడం బక్కాహ్ (మక్కాహ్ పాత పేరు). ఇది పవిత్రమైనదే కాదు, మానవ జాతికి అమూల్యమైన మార్గదర్శిని.. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం అదే కట్టడం, ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఆయన కుమారుడు, ప్రవక్త ఇస్మాయిల్ (అలైహిస్సలాం) ద్వారా పునరుద్ధరణ గావించబడింది. హిమ్యారైత్ (ఇప్పుడు యెమెన్) ను పాలించిన యూదు రాజు తుబ్బ అబు కరబ్ అసద్, 5వ శతాబ్దపు ప్రారంభంలో, మొదటిసారిగా కాబాని సందర్శించటానికి వచ్చినపుడు (అప్పుడు మక్కాని పాలిస్తున్నది జుర్హుమ్ తెగ వారు) అత్యంత వినమ్రతతో కాబాకు కిస్వా (Covered by a cleanly cloth) వేయటం జరిగింది.
అప్పటి నుండి ఆ సంప్రదాయం కొనసాగింది. మహా ప్రవక్త కాలంలో, కాబా ముస్లిముల చేతికి వచ్చినప్పటికీ ఆ సంప్రదాయంలో మార్పు జరగలేదు. అయితే ఇప్పుడున్న నల్ల రంగు మాత్రమే గాక కొన్ని సందర్భాలలో కిస్వా వేరే రంగులలోనూ ఉండేది. ఉదాహరణకు, మహా ప్రవక్త కాలంలో ఒకావిడ దీపం వెలిగిస్తుండగా, మంటలు చెలరేగాయి. అప్పుడు మహా ప్రవక్త యమనీ తెల్లరంగు కిస్వా వేయటం జరిగింది. అనేక మంది ప్రముఖ రాజులు, కిస్వా విషయంలో తమదైన మార్పులు చేశారు. మువావియా 1 అనే రాజు, అబ్ద్-అల్లా ఇబ్న్ అల్-జుబైర్, అబ్ద్ అల్-మాలిక్ ల సహాయంతో పాటు సంవత్సరానికి రెండుసార్లు కాబాను అలంకరించేవారు. వారు సంప్రదాయ సిల్క్ కవరింగ్ అమలులోకి తెచ్చారు. అల్-నాసిర్ అనే అబ్బాసిద్ రాజు, పాత కిస్వా ఒకదానిపై ఒకటి ఉండేలా అనుమతించే పూర్వపు ఆచారాన్ని రద్దు చేస్తూ, కాబాను ఒకేసారి ఒక కిస్వాతో మాత్రమే ధరించే ప్రస్తుత పద్ధతిని స్థాపించాడు. అల్-నాసిర్ 160 AHలో హజ్ చేసినప్పుడు, పేరుకుపోయిన కిస్వా, కాబాకు నష్టం కలిగించవచ్చని గ్రహించి, ఎప్పుడైనా ఒక కిస్వా మాత్రమే కాబాను కప్పాలని ఆదేశించాడు.
రాజు అల్-మమున్, సంవత్సరానికి మూడు సార్లు కాబాను కప్పాడు, ప్రతిసారీ వేర్వేరు రంగులతో. దు అల్-హిజ్జా (నెల) యొక్క ఎనిమిదవ తేదీన ఎరుపు, రజబ్ (నెల) మొదటి రోజున తెలుపు గబాతి, రమదాన్ (నెల) ఇరవై తొమ్మిదవ తేదీన ఎరుపు బ్రోకేడ్. అయితే, అల్-నాసిర్ కాబాను ఆకుపచ్చతో కప్పటం జరిగింది. అల్-నాసిర్, అల్-మమున్ ఇద్దరూ తరచూ రంగు మారడంపై విభేదించారు. చివరకు మహా ప్రవక్త కాలంలో ఉన్న నలుపు రంగులోకి మార్చారు, అప్పటి నుండి అదే కిస్వా కోసం ఉపయోగించబడిన ఏకైక రంగు. ఇక కిస్వా వెనక ఫోటోలో కనిపిస్తున్న సాధారణ గోడ ఉంటుంది. ఒక చిన్న గది. ఒక తలుపు ఉంది. లోపల ఖాళీగానే ఉంటుంది. రూఫ్ ని సపోర్ట్ చేయటానికి మూడు పిల్లర్స్ ఉన్నాయి. ఎవరూ వెళ్ళరు, లోపలకు వెళ్లాల్సిన సంప్రదాయం ఏమీ లేదు. క్రమంగా అనుమతి కూడా తీసివేయబడింది.