మనం పాటించే అనేక అలవాట్లకు సంబంధించి పెద్దలు అనేక నియమాలను చెబుతుంటారు. వాటిల్లో రాత్రి పూట గోళ్లను తీయవద్దనే నియమం ఒకటి. దీన్ని చిన్నప్పటి నుంచి చాలా మంది వినే ఉంటారు. ఎవరైనా రాత్రి పూట గోళ్లను తీస్తుంటే అలా చేయవద్దని పెద్దలు వారిస్తుంటారు. అయితే అసలు ఇలా చేయవద్దని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడంటే మనకు గోళ్లను కట్ చేసుకునేందుకు నెయిల్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వం అందుకు బ్లేడ్లను వాడేవారు. రాత్రుళ్లు అప్పట్లో కరెంటు ఉండేది కాదు. దీపాలను పెట్టుకునేవారు. కనుక రాత్రి పూట చీకటిగా ఉంటుంది కాబట్టి గోళ్లను తీస్తే బ్లేడ్‌తో వేళ్లకు గాట్లు పడేందుకు అవకాశం ఉంటుంది. కనుకనే రాత్రి పూట గోళ్లను తీయవద్దని చెప్పేవారు.
ఇక ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక మంత్ర తంత్రాలను ఎవరూ నమ్మడం లేదు. కానీ పూర్వం వీటిని ప్రజలు ఎక్కువగా నమ్మేవారు. రాత్రుళ్లు మంత్రగాళ్లు తిరుగుతుంటారని, అలాంటి సమయంలో గోళ్లను తీస్తే వారు ఆ గోళ్లను తీసుకెళ్లి చేతబడి చేస్తారని నమ్మేవారు. అందువల్ల గోళ్లను రాత్రి పూట తీయవద్దని చెబుతారు.
ఇక దీని వెనుక ఉన్న ఇంకో కారణం ఏమిటంటే.. గోళ్లను జ్యోతిష్యం, వాస్తు ప్రకారం శల్య దోషం కింద భావిస్తారు. రాత్రి పూట గోళ్లను తీస్తే వాటిని సరిగ్గా పడేయకపోతే అవి మన ఇంటి చుట్టు పక్కల నేలలోనే ఉండిపోయేందుకు అవకాశం ఉంటుంది. దీంతో శల్య దోషం ఏర్పడుతుంది. అది మంచిది కాదు. కనుకనే రాత్రి పూట గోళ్లను తీయవద్దని చెప్పేవారు.
రాత్రి పూట అప్పట్లో కరెంటు ఉండేది కాదు కనుక గోళ్లను తీసి ఎక్కడంటే అక్కడ వేస్తే అవి కాళ్లలో గుచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి పూట లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందట. అలాంటి సమయంలో వ్యర్థాలను తీయడం అంత మంచిది కాదట. ఆమెను అవమానించినట్లు అవుతుందట. అందుకనే ఈ కారణాల వల్లే రాత్రి పూట గోళ్లను తీయవద్దని పెద్దలు చెబుతుంటారు.