మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం దాగి ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అందుకే అనాధిగా పూర్వీకులు ప్రవేశపెట్టిన అనేక నియమాలను మనం పాటిస్తూ వస్తున్నాం. వాటిలో ఒకటి తిన్న ప్లేట్ లో చేయి కడగకపోవడం ఒకటి. అయితే తిన్న కంచంలో చెయ్యి ఎందుకు కడగకూడదు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తిన్న ప్లేట్ లో చెయ్యి కడగగానే మనకు అక్కడనుంచి లేవబుద్ధి అవదు. ఇది మానసికంగా మనల్ని బద్దకస్తులుగా మారుస్తుంది. మీరు కావాలంటే పరీక్ష చేయవచ్చు. తిన్న ప్లేట్లోనే చేయి కడిగి చాలా మంది అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఇది బద్దకానికి సూచన. కనుక ఇలా చేయకూడదు. అలాగే తిన్న తరవాత లేచి రెండు అడుగులు వేస్తే తిన్నాము అనే అనుభూతి కలుగుతుంది. లేదంటే భోజనం చేసిన సంతృప్తి ఉండదు. మళ్లీ వెంటనే ఏదైనా తింటారు. ఇది బరువు పెరిగేలా చేస్తుంది.
తిని అలా లేచి చెయ్యి కడుక్కుంటే కడుపులో తిన్న ఆహారం సర్దుకుంటుంది. జీర్ణవ్యవస్థ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో పడుతుంది. మనం చెయ్యి కడిగిన ఎంగిలి కంచం తీయడం కంచాలు తీసే వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్లేట్లో చేతులు కడగకూడదు. మనం తిని చేయి కడుక్కుని అక్కడే కూర్చుంటే మన తరవాత తినే వాళ్ళకు స్థలం దొరకక ఇబ్బంది పడవచ్చు. కనుకనే మన పూర్వీకులు తిన్న ప్లేట్లో కడగకూడదని చెప్పి ఉండవచ్చు.