సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఒకటి వచ్చిందంటే దాని వెనుకే ఇంకో అనారోగ్య సమస్య మనపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే జలుబును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జీలకర్రను వేయించి పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో చక్కెర తీసుకుని రెండింటినీ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు లేదా పాలలో కలిపి రాత్రి నిద్రకు ముందు తాగాలి. దీంతో జలుబు తగ్గుతుంది.
2. చిన్న బెల్లం ముక్కను తీసుకుని పొడి చేసి అందులో కొద్దిగా మిరియాల పొడి కలపాలి. దాన్ని చిన్న ఉండలా చేయాలి. ఆ ఉండను పూటకు ఒకటి చొప్పున గోరు వెచ్చని నీళ్లతో మింగుతుండాలి. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. వాము అర టీస్పూన్, పటిక బెల్లం టీస్పూన్ తీసుకుని చూర్ణంలా చేసి తినాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తే ఫలితం ఉంటుంది.
4. లవంగాలు లేదా మిరియాలను తీసుకుని నీళ్లలో వేయాలి. అందులో కొద్దిగా బెల్లం కూడా వేయాలి. దాన్ని కషాయంలా కాచి రోజుకు రెండు సార్లు 60 ఎంఎల్ చొప్పున తీసుకోవాలి. జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
5. వామును కొద్దిగా తీసుకుని వేడి చేసి దాన్ని ఒక పలుచని గుడ్డలో కట్టి దాంతో ముఖంపై కాపడం పెట్టాలి. దీంతో శ్లేష్మం కరుగుతుంది. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే గుడ్డలో ఉన్న వామును వాసన పీల్చవచ్చు. దీంతో కూడా జలుబు నుంచి బయట పడవచ్చు.
6. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగుతుంటే ఫలితం ఉంటుంది.
7. పసుపును పావు టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక కప్పు గోరు వెచ్చని నీళ్లలో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవచ్చు. సమస్యలు తగ్గుతాయి.
8. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి, బెల్లం కలిపి తాగుతుంటే జలుబు తగ్గుతుంది.
9. గులాబీ పువ్వు రేకులను తీసుకుని నువ్వుల నూనెలో వేసి అర గంట పాటు ఉంచాలి. తరువాత 5 నిమిషాలు వేడి చేయాలి. అనంతరం వడకట్టి ఆ మిశ్రమాన్ని ఒక్కో నాసికా రంధ్రంలోనూ 2 చుక్కల చొప్పున వేస్తుండాలి. దీంతో తుమ్ములు తగ్గుతాయి.
10. మిరియాల పొడి అర టీస్పూన్, ఒక టీస్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.