మలబద్దకం సమస్య.. ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

మనలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. కడుపు చాలా బరువుగా ఉందని, విరేచనం సరిగ్గా అవడం లేదని, బద్దకంగా ఉందని డాక్టర్లకు చెబుతుంటారు. అయితే మలబద్దకం అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఇది ఈనాటి సమస్య కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. మలవిసర్జన సరిగ్గా జరగకపోవడం లేదా అస్సలు విరేచనం అవకపోవడాన్ని మలబద్దకం అంటారు. ఇది ఉన్న వారు పడే బాధ వర్ణనాతీతం.

malabaddakam samasya ayurveda chitkalu

సాధారణంగా మనం తిన్న ఆహార పదార్థాల నుంచి అవసరమైన పోషకాలను శరీరం గ్రహించాక మిగిలిపోయిన వ్యర్థాలను శరీరం బయటకు పంపుతుంది. దాన్ని మలం అంటారు. అది రోజుకు రెండు సార్లు వస్తే ఆరోగ్యగంగా ఉన్నట్లు లెక్క. ఒక్కసారి వచ్చినా ఫర్వాలేదు. కానీ మల విసర్జన సరిగ్గా జరగకపోయినా లేదా అసలు విరేచనం అవకపోయినా దాన్ని సమస్యగా భావించాలి. కొందరికైతే 2 నుంచి 5 రోజుల వరకు విరేచనం కాదు. దీన్ని తీవ్రమైన మలబద్దక సమస్యగా భావిస్తారు. ఇలా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. తగిన జాగ్రత్తలు పాటించాలి. రోజూ సుఖ విరేచనం అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

ఇక ఆయుర్వేదం ప్రకారం పిత్త దోషం వల్ల మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. అందువల్ల ఆ దోషాన్ని తగ్గించేలా సూచనలు పాటించాలి.

అర్థం పర్థం లేని ఆహారపు అలవాట్లు, వేళకు భోజనం చేయకపోవడం, వేగంగా ఆహారం తినడం, అతిగా భోజనం చేయడం, పీచు పదార్థాలను తక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, వివిధ రకాల ఇంగ్లిష్‌ మందులను వాడడం, షుగర్‌, థైరాయిడ్‌ సమస్యలు, కాల్షియం అధికంగా ఉండడం వంటివన్నీ మలబద్దకం వచ్చేందుకు కారణాలు. అయితే మలబద్దకం సమస్య ఎక్కువైతే పలు లక్షణాలు కనిపిస్తాయి.

మలబద్దకం సమస్య అధికం అయితే నోటిపూత, వికారం, వాంతులు, నాలుక తెల్లగా అవడం, ఆహారం ఏమీ తినకపోయినా పొట్ట ఉబ్బినట్లుగా ఉండడం, కడుపు పైభాగంలో నొప్పి అనిపించడం, అర్శమొలలు ఏర్పడడం, కీళ్ల నొప్పులు, గుండెల్లో మంట, అసిడిటీ, త్రేన్పులు అధికంగా రావడం, నిద్రలేమి, ఆందోళన, చర్మం సహజసిద్ధమైన కాంతిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

1. పైనాపిల్‌, మామిడి పండ్లను తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.

2. మారేడుకాయలు పండిన తరువాత గుజ్జు చక్కని విరేచనకారిగా పనిచేస్తుంది.

3. రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ త్రిఫల చూర్ణం కలిపి తాగితే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.

4. బాగా మగ్గిన అరటిపండ్లను తింటున్నా మలబద్దకం తగ్గుతుంది.

5. ఒక టీస్పూన్‌ కరివేపాకుల పొడి, తేనెలను కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటుంటే మలబద్దకం తగ్గుతుంది.

6. రాత్రి పూట ఒక టీస్పూన్‌ ఆముదాన్ని వేడి చేసి నిద్రించే ముందు తీసుకోవాలి. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది.

7. రోజూ ఉదయాన్నే పాలకూర రసాన్ని సేవిస్తే మలబద్దకం సమస్య ఉండదు.

8. రాత్రి పూట రాగి చెంబులో నీటిని పోసి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

9. గుప్పెడు కిస్మిస్‌లను రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ కిస్మిస్‌లను తినాలి.

10. జామ, బొప్పాయి పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే మలబద్దకం సమస్య ఉండదు.

11. రాత్రి నిద్రించే ముందు నువ్వులు, బెల్లం కలిపి నిమ్మ కాయంత సైజులో ఉండగా చేసుకుని తినాలి. వారం రోజుల పాటు తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.

12. రోజూ ఉలవల కషాయం తాగవచ్చు. లేదా ఉలవలతో చారు చేసుకుని తాగవచ్చు.

13. ఒక గ్లాస్‌ బార్లీ నీటిలో రెండు టీస్పూన్ల తేనె కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగితే ఫలితం ఉంటుంది.

14. అర గ్లాస్‌ నీటిలో రెండు నిమ్మకాయల రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకోవాలి. మలబద్దకం తగ్గుతుంది.

మలబద్దకం సమస్య తగ్గేవరకు వేపుళ్లు, మసాలాలు, కారం అధికంగా ఉండే ఆహారాలను మానేయాలి. డబ్బాలలో నిల్వ ఉంచిన ఆహారం, పచ్చళ్లను తినరాదు. కాఫీ, టీ, ధూమపానం, మద్యపానం మానేయాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. తాజా పండ్లు లేదా పండ్ల రసాలను తీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. అతిగా తినరాదు. వేళకు నిద్రపోవాలి. ఆందోళన, ఒత్తిడి తగ్గించుకోవాలి. రోజూ ఉదయాన్నే చన్నీళ్ల స్నానం చేయాలి. నిద్రలేవగానే 2 గ్లాసుల నీటిని తాగాలి. ఈ చిట్కాలు, సూచనలు పాటించడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts