మహిళలకు వచ్చే అనేక అనారోగ్య సమస్యల్లో పీసీవోఎస్ (PCOS) కూడా ఒకటి. దీన్నే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. సాధారణంగా ఈ సమస్య మహిళల్లో హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల వస్తుంటుంది. 15 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
స్త్రీలకు రుతుక్రమం ఆరోగ్యంగా ఉంటే నెల నెలా అండాలు సరిగ్గా విడుదల అవుతాయి. అయితే హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయంలో మార్పులు సంభవించి ఫలితంగా అండం సరిగ్గా తయారు కాకపోవడం లేదా అండం విడుదల అవడంలో ఆలస్యం అవుతుంటుంది. దీంతో రుతు క్రమం సరిగ్గా ఉండదు. ఆలస్యంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో సమస్యను పట్టించుకోకపోతే అండాశయంలో గాలి బుడగలు లేదా నీటి తిత్తుల లాంటివి ఏర్పడుతాయి. వీటినే సిస్ట్స్ అంటారు. దీంతో సంతాన లోపం సమస్య తలెత్తుతుంది.
పీసీవోఎస్ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఇవే
* రుతు క్రమం సరిగ్గా ఉండదు, ఆలస్యం అవుతుంది లేదా ఎక్కువగా అవుతుంది.
* అవాంఛిత రోమాలు వస్తాయి.
* మొటిమలు వస్తుంటాయి.
* జుట్టు రాలుతుంది. వెంట్రుకలు పలుచబడుతాయి.
* బరువు ఒక్కసారిగా తగ్గడం లేదా పెరగడం జరుగుతుంటుంది.
* మానసిక సమస్యలు ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతారు. ఏదో కోల్పోయినట్లు ఉంటారు.
కారణాలు
పీసీవోఎస్ వచ్చేందుకు సరైన కారణాలు ఏమీ లేవు. కానీ సైంటిస్టులు పరిశోధనల ద్వారా పీసీవోఎస్ వచ్చేందుకు గల కారణాలు కొన్నింటిని తెలిపారు.
* స్త్రీలలో సాధారణంగా ఆండ్రోజెన్స్ అనే హార్మోన్లు విడుదల అవుతుంటాయి. వీటినే పురుష హార్మోన్లు అంటారు. అయితే స్త్రీలలో ఈ హార్మోన్లు గనక ఎక్కువగా విడుదల అయితే అప్పుడు పీసీవోఎస్ సమస్య తలెత్తుతుంది.
* టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ (ఇన్సులిన్ నిరోధకత) ఎక్కువగా ఉంటుంది. అయితే స్త్రీలలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడితే అది పీసీవోఎస్ సమస్యకు దారి తీస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే శరీరంలో క్లోమ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేసినా శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోదు. ఫలితంగా శరీరంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు ముందుగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఈ సమయంలో స్త్రీలలో పీసీవోఎస్ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
పీసీవోఎస్‌కు గైనకాలజిస్టులు చికిత్సను అందిస్తారు. ముందుగా లక్షణాలను బట్టి వైద్య పరీక్షలు చేస్తారు. పెల్విక్ ఎగ్జామినేషన్, అల్ట్రా సౌండ్, రక్త పరీక్షలు చేసి పీసీవోఎస్ ఉందీ, లేనిదీ నిర్దారిస్తారు. అనంతరం మందులను ఇచ్చి చికిత్స ప్రారంభిస్తారు. నెలసరి సరిగ్గా వచ్చేందుకు, హార్మోన్లను నియంత్రించేందుకు, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించేందుకు, ఇతర పీసీవోఎస్ లక్షణాలకు మెడిసిన్లను ఇస్తారు. దీంతో పీసీవోఎస్ నియంత్రణ అవుతుంది. ఫలితంగా సంతానం లోపం సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
పీసీవోఎస్ సమస్య ఉన్న మహిళలు వైద్యుల సూచన మేరకు మందులను వాడడంతోపాటు జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవాలి. నిత్యం పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలి. దీంతో పీసీవోఎస్ తగ్గుతుంది.
* నానబెట్టిన బాదం పప్పు, కిస్మిస్ పండలు, వాల్‌నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసె గింజలు, తాజా పండ్లు, కూరగాయలు (ముఖ్యంగా ఆకు కూరలు), పులిసిన ఆహారం (ఇడ్లీ మొదలైనవి) తరచూ తింటుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పీసీవోఎస్ సమస్య నుంచి త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది.
* నిత్యం కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులతోపాటు విటమిన్లు, మినరల్స్ శరీరానికి సమపాళ్లలో అందేలా చూసుకోవాలి. దీంతో శరీరానికి పోషణ లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
* ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించేందుకు చక్కెర తక్కువగా ఉండే పదార్థాలను తినాలి. లేదా తీపి పదార్థాలను తినడం పూర్తిగా మానేయాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు పాటించే ఆహార సూచనలు పాటించాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు తదితర చిరు ధాన్యాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించుకోవచ్చు.
* వేపుళ్లు, పచ్చళ్లు, స్వీట్లు, చక్కెరతో చేసిన ఇతర పదార్థాలు తక్కువగా తినాలి. లేదా మానేయాలి. అలాగే మెటబాలిజంను పెంచే గ్రీన్ టీ లాంటి తాగాలి. దీంతో శరీరంలో జీవ క్రియలు కూడా సరిగ్గా జరుగుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది.
* నిత్యం ఒకే టైముకు భోజనం చేయాలి. అంటే ఉదాహరణకు ఒక రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఒక టైముకు చేశారనుకోండి. తరువాతి రోజు నుంచి రోజూ అదే సమయానికి ఆయా ఆహారాలను తీసుకోవాలి. అలాగే రాత్రి పూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తినాలి. ఆలస్యంగా భోజనం చేయరాదు.
* నిత్యం తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు.
* రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రించాలి. త్వరగా నిద్రించాలి. త్వరగా మేల్కొనాలి.
* సేంద్రీయ పద్ధతిలో (ఆర్గానిక్) పండించిన పండ్లు, కూరగాయలను తింటే మంచిది.
* ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. యోగా, ధ్యానం చేయాలి. పుస్తకాలను చదవచ్చు. ఇష్టమైన సంగీతం వినవచ్చు. మనస్సు రిలాక్స్ అవుతుంది.
పైన తెలిపిన సూచనలు అన్నింటినీ పాటించడంతోపాటు డాక్టర్ ఇచ్చే మందులను కూడా క్రమం తప్పకుండా వాడితే కచ్చితంగా పీసీవోఎస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365