గరగరమని గొంతులో శబ్దం వస్తుంటే దాన్ని సోర్ త్రోట్ అంటారు. ఈ స్థితిలో గొంతు బొంగురుపోయి చీము వస్తుంది. తరచూ గొంతు నొప్పి వచ్చే వారికి ఈ సమస్య వస్తుంది. దీంతో గొంతు వాపు వచ్చి గుటకవేస్తే నొప్పిగా అనిపిస్తుంది. గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉంటుంది.
సోర్ త్రోట్ సమస్య ఎప్పుడైనా వస్తుంది. దీనికి సీజన్లతో సంబంధం లేదు. చిన్నారులు, పెద్దలు అందరికీ ఈ సమస్య వస్తుంది. బాక్టీరియా, వైరస్‌ల వల్ల ఈ సమస్య వస్తుంది. పొగ తాగేవారు, బీర్లు ఎక్కువగా తాగేవారు, చల్లని పానీయాలు తాగేవారు, మత్తు పానీయలు తీసుకోవడం, కలుషితమైన గాలిని పీల్చడం, కలుషితమైన నీటిని తాగడం, అలర్జీలు వంటివి గొంతు సమస్యలకు కారణమవుతుంటాయి. సోర్ త్రోట్‌నే ఫెరింజైటిస్ లేదా టాన్సిలైటిస్ అని కూడా పిలుస్తారు.
సోర్ త్రోట్ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ దాదాపుగా గొంతు నొప్పి కామన్‌గా ఉంటుంది. గుటక వేస్తున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. ఆ నొప్పి చెవుల్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. గొంతు ఎర్రగా అయి వాపులకు గురవుతుంది. కొందరికి శరీరం వెచ్చగా ఉంటుంది. జ్వరం ఉంటుంది. మెడ కింద, దవడల కింద వాపులు కనిపిస్తాయి. దీంతో గొంతు లోపల చిన్న చిన్న కురుపులు కూడా వస్తాయి. అవి నొప్పిని కలిగిస్తాయి.
దాదాపుగా అన్ని రకాల వైరస్‌లు ఈ సమస్యలు వచ్చేందుకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా ఫ్లూ ఉన్నవారికి, నోటి ద్వారా గాలి తీసుకునే అలవాటు ఉన్నవారికి, గొంతు తరచూ ఎండిపోయే వారికి, సైనస్ సమస్య ఉన్నవారికి, కీమోథెరపీ మందులను వాడేవారికి ఈ సమస్యలు వస్తాయి. రెండు వారాల పాటు ఉన్నా తగ్గకపోతే దాన్ని సోర్ త్రోట్ సమస్యగా భావించాలి. దీంతోపాటు జ్వరం, తలనొప్పి, గురక, స్వరం మారటం, మాట్లాడలేకపోవడం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఉంటాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ సమస్యలకు పలు చిట్కాలు పనిచేస్తాయి.
1. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఇంగువను కలిపి ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించాలి. గొంతు నొప్పి తగ్గుతుంది.
2. కుంకుడు కాయల లోపల గింజలను తీసుకుని నీళ్లతో అరగదీసి ఆ గంధాన్ని గొంతుకు ఇరువైపులా టాన్సిల్స్ మీద రాస్తుంటే మామూలుగా అవుతాయి.
3. జాపత్రి, దాల్చినచెక్క, జాజికాయలను సమానంగా తీసుకుని మర్దించి చిన్న మాత్రలు చేసి తులసి ఆకులతో తాంబూలంగా తీసుకోవాలి. నోటి నుంచి వచ్చే చెడు వాసన పోతుంది.
4. తరచూ గొంతు నొప్పి వచ్చేవారు వేడి నీళ్లను కొంచెం కొంచెం తాగుతూ ఉండడం మంచిది. అలాగే పిప్పళ్లు, వస, పసుపు వీటిని సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ఆ పొడికి పటికబెల్లం పొడి కలిపి తినాలి. అన్ని రకాల గొంతు సమస్యలు తగ్గుతాయి.
5. అల్లం, బెల్లంలను సమాన భాగాల్లో తీసుకుని చూర్ణం చేసి చిన్న మాత్రలుగా తయారు చేసి వేడి నీళ్లతో తీసుకుంటుండాలి. గొంతు వ్యాధులు తగ్గుతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.
6. బెల్లం పాకం పట్టి అందులో మిరియాల పొడి కలిపి చిన్న మాత్రలుగా తయారు చేసి తీసుకోవాలి. గొంతు సమస్యలు తగ్గుతాయి.
7. ఒక గ్లాస్ వేడి పాలలో 5 మిరియాలు పొడి చేసి కలుపుకుని, బెల్లం కలిపి కొంచెం తులసి రసం వేసి వేడి వేడిగా తాగాలి. రోజుకు నాలుగు సార్లు తాగితే ఫలితం ఉంటుంది.
8. వామును కొంత తీసుకుని దాన్ని కొద్దిగా వేయించాలి. అనంతరం దాన్ని పలుచని గుడ్డలో మూటగా కట్టాలి. దీంతో గొంతుకు ఇరువైపులా కాపడం పెట్టాలి. గొంతు సమస్యలు తగ్గుతాయి.
9. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి పుక్కిట పట్టాలి. గొంతు నొప్పి తగ్గుతుంది.
10. అర గ్లాసు గోరు వెచ్చని పాలలో కొద్దిగా వెల్లుల్లి రసం కలుపుకుని తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లిలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి.
11. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగుతుంటే ఎరుపెక్కిన గొంతు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.
12. చక్కెర, ఉల్లిపాయలు కలిపి నూరి చిన్న చిన్న మాత్రల్లా తయారు చేసుకోవాలి. వాటిని పూటకు ఒకటి వేసుకుంటూ గోరు వెచ్చని నీటిని తాగాలి. గొంతు సమస్యలు తగ్గుతాయి.
13. వేడి టీలో అర టీస్పూన్ తేనె, నిమ్మరసం 10 చుక్కలు కలిపి తాగాలి. గొంతు సమస్యలు తగ్గుతాయి.
14. సీతాఫలాది చూర్ణం తేనెలో రంగరించుకుని రోజూ మూడు సార్లు తీసుకుంటే మంచిది. అలాగే లవంగాది వటి వేడినీళ్లతో రోజూ మూడు సార్లు తీసుకోవాలి. కధిరాది వటిని కూడా వాడవచ్చు. మరీచాది వటి కూడా మేలు చేస్తుంది.
15. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో పది తులసి ఆకులను వేసి మరిగించాలి. ఆ నీటిని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.
16. ఒక కప్పు వేడి నీటిలో పావు టీస్పూన్ మిరియాల పొడి తాగాలి. గొంతు సమస్యలు తగ్గుతాయి.
17. తమలపాకులను నూరి గొంతుపై పూతగా పూయాలి. ఇలా చేస్తుంటే గొంతు వాపు, నొప్పి తగ్గుతాయి.
18. మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని గొంతులో పోసి పుక్కిలిస్తుండడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.