నేల మీద నిలబడని స్పైడర్ మ్యాన్‌లు, పైకి ఎగిరిపోయే హీమ్యాన్‌లు, పై నుంచి దూకేసే సూపర్ మ్యాన్‌లు చూశాం. పోన్‌మ్యాన్‌ని చూశారా? చూడకపోతే వెంటనే చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఈ పోన్‌మ్యాన్‌కి ఎగరడాలు, దూకడాలు అస్సలు రావు. వార్నింగ్‌లు, ఫైటింగ్‌లు చేతకావు. కేవలం మనలో ఒకడు. మనలాంటి వాడు మాత్రమే. అయినా సరే.. వాళ్ల కంటే అద్భుతంగా కనిపిస్తాడు.ఈ సినిమాకి పోన్‌మ్యాన్ అని పేరు పెట్టిన డైరెక్టర్ ఆలోచనకి నేనైతే ఆల్ మోస్ట్ ఫిదా అయిపోయాను.అందులో ఆయన తెలివి, చమత్కారం, మంచి ఇంటెన్షన్ కనిపించాయి. మామూలుగా చూస్తే పోన్‌మ్యాన్ ఇదొక డార్క్ కామెడీ సినిమాగా మాత్రమే అనిపిస్తుంది. నవ్వు తెప్పించే కామెడీయే కాదు.. కంటతడి పెట్టించే విషయాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా మొత్తం బంగారం చుట్టూ తిరుగుతుందనిపిస్తుంది. కానీ కాదు బంగారం లాంటి క్యారెక్టర్”చుట్టూ తిరుగుతుంది. నిప్పులో కాల్చినా, నీటిలో ముంచినా, మట్టిలో పూడ్చినా కూడా బంగారం విలువ ఏ మాత్రం తగ్గదు. అలాంటి ధృఢమైన క్యారెక్టరే పోన్‌మ్యాన్ సినిమా. పోన్ అంటే బంగారం, మ్యాన్ అంటే వ్యక్తి. ఈ సినిమా పేరు అర్థం ఇది.
ఇందులో మెయిన్ లీడ్‌గా బాసిల్ జోసెఫ్ నటించాడు. బాసిల్ జోసెఫ్ తన నటనతో ఎంతగా మెప్పించాడంటే తను ఇచ్చే ప్రతి ఎక్స్‌ప్రెషన్, రియాక్షన్, డైలాగ్ మనల్ని కట్టిపడేస్తుంది. తనతోపాటు మనల్ని నడిపిస్తాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు, ఏడిపిస్తాడు. బహుశా ఈ క్యారెక్టర్‌ని బాసిల్ తప్ప ఇంకెవరూ ఇంత రియలస్టిక్‌గా చేయలేరేమోనని అనిపించేలా ఆ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. ఈ సినిమా కథ చెప్పాలంటే పీపీ అజేశ్ (బాసిల్ జోసెఫ్) గోల్డ్ జ్యుయలరీ సేల్స్ ఏజెంట్. అంటే బంగారం సేల్ చేసే వ్యక్తి కాదు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురు కుటుంబానికి బంగారాన్ని సమకూర్చి, వాటి డబ్బును చదివిపుల రూపంలో వచ్చిన వాటితో జమ చేసుకుంటాడు. దీనికోసం ముందుగానే అగ్రిమెంట్ కూడా చేసుకుంటాడు. అలా ఓ పెళ్లికూతురు కోసం 25 సవర్ల బంగారం ఇప్పిస్తాడు.
తీరా పెళ్లిలో చదివింపులు కనీసం బంగారం విలువలో సగం కూడా రావు. దీంతో వచ్చిన చదివింపుల మేర బంగారం ఉంచుకుని, మిగతా బంగరం ఇచ్చేయమని కుటుంబాన్ని కోరతాడు. కానీ ఆ పెళ్లి కూతురు స్టెఫీ మొత్తం బంగారంతో అత్తారింటికి వెళ్లిపోతుంది. అజేశ్ మాత్రం తన నగలు కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తాడు. మన హీరోలైతే.. ఒక ఫైటింగ్, వార్నింగ్‌తోనో ఫట్ ఫట్ మని ఆ బంగారాన్ని వెనక్కి తీసేసుకుంటారు. కానీ అజేశ్ ఒక సామాన్యమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అంత బంగారాన్ని వెనక్కి ఎలా తీసుకున్నాడన్నదే కథ. ఈ చిన్న లైన్‌తో డైరక్టర్ .. రెండున్నర గంటల సినిమాగా తీయడమే కాకుండా.. అందరూ కళ్లగప్పించి చూసేలా చేయగలిగాడు. అంతేకాదు అజేశ్ (బాసిల్) క్యారెక్టర్‌తో చాలా పెద్ద విషయాలను కూడా మనకు చెప్పాడు.
మామూలు మధ్య తరగతి మనుషులతో అవసరం, ఆకలి, ఆత్మవిశ్వాసం, నిజాయితీ దోబుచూలాడుతుంటాయి. అవసరాలు, ఆకలి ముందు చాలాసార్లు ఆత్మవిశ్వాసం, నిజాయితీ ఓడిపోతుంటాయి. కొన్ని విపత్కర సమయాల్లో నిజాయితీని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండగలగడం అంత సులభమైన విషయం కాదు. దానికి చాలా ధృఢంగా ఉండాలి. పట్టుదలగా, ఓర్పుగా ఉండాలి. ఈ విషయమే పోన్‌మ్యాన్ సినిమా చెప్పింది. అందుకే సూపర్‌మ్యాన్ కంటే.. పోన్‌మ్యాన్.. మన మనస్సులను గెలుచుకుంటాడు. ఈ సినిమాలో అజేష్ ముందు తనను పార్టీలోంచి తీసేశారనే బాధతో ఓ వ్యక్తి ఉరివేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో కొన్ని డైలాగ్స్ కచ్చితంగా అందరికి తాకుతాయి. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ కూడా చాలా సాధారణంగా అనిపించినా.. ఆలోచన కలిగించేలా చేస్తాయి. జీయో హాట్‌స్టార్‌లో ఉంది.. చూడకపోతే వెంటనే చూసేయండి.