సినిమా నిర్మాణ రంగ సంస్థల్లోకెల్లా దివంగత దగ్గుపాబాటి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో ఏళ్ల కిందటే నిర్మాణ సంస్థలు ప్రారంభించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించిన ఘనత దగ్గుబాటి వారిది. ఈ బ్యానర్ కి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దగ్గుబాటి సురేష్ బాబు పేరు మీదుగా ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించిన రామానాయుడు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెలుగు పరిశ్రమకు అందించారు. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకున్నారు. తండ్రి, తాత స్టార్ నిర్మాతలు అయినా.. తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర రానా వేసుకున్నాడు అనేది వాస్తవం. రానా సినిమాలు అనగానే అన్ని భాషల్లో కూడా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రానా. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాలలో నటించారు రానా. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో తన పేరుని దశ దిశలో వ్యాపింపచేశాడు. తనదైన శైలిలో నటిస్తూ పలు పాత్రల్లో జీవిస్తున్నాడు. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ తో నటించి ఔరా అనిపించుకున్నాడు. దీంతో సినిమాల్లో మంచి పాత్రలు ఎంచుకొని తన సత్తా చాటుతున్నాడు. ఇక రానా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈయన పాఠశాల విద్యను హైదరాబాదులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమం నుండి అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నారు. మొదట పలు టీవీ షోలో కూడా రానా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే 2020 ఆగస్టు 8న మిహికా బజాజ్ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
అయితే రానా అసలు పేరు రామానాయుడు కాగా.. రానా అనే పేరు ఎలా పెట్టారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. మొదట రానాకి సిద్ధార్థ అనే పేరును పెట్టాలని అనుకున్నారట రానా తల్లి లక్ష్మి. అయితే బారసాల రోజున కొడుకు పేరు రాయాలని పంతులుగారు చెప్పినప్పుడు సురేష్ బాబు తన తండ్రి పేరు అయిన రామానాయుడు పేరును రాశారట. అయితే ఆ పేరు పెడుతున్నట్లు సురేష్ బాబు ఎవరికీ చెప్పలేదట. వాళ్ల నాన్న పేరు పెట్టాలని ముందే ఫిక్స్ అయ్యాను కాబట్టి పెట్టేశాను అని సురేష్ బాబు ఒక సందర్భంగా తెలిపారు. ఇలా సురేష్ బాబు చేసిన పనికి రామానాయుడు చాలా సంతోషించారు. అయితే సురేష్ బాబు గారి ఫ్రెండ్ ఒకాయన రామానాయుడు అని తాను పిలవలేనని.. రామా నాయుడు పదాల్లోని మొదటి అక్షరాలను కలిపి రానా అని పిలుస్తానని చెప్పారట. అలా రానా అనే పేరు స్థిరపడిపోయిందని.. ఈ విషయాన్ని రానా ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.