NTR Krishna : సినీ ఇండస్ట్రీలో అగ్ర తారల మధ్య పోటీ ఉండడం సర్వ సాధారణం. కొందరు హీరోల మధ్య ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంటుంది. వీరి సినిమాలు విడుదల అయినప్పుడు ఎవరు విజయం సాధిస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ – ఏఏన్ఆర్, ఎన్టీఆర్ – కృష్ణ, కృష్ణ – శోభన్ బాబు, చిరంజీవి – బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ – మహేశ్ బాబు.. వీరు టాలీవుడ్ లో అతి పెద్ద పోటిదారులు అని మనందరికీ తెలిసిందే. వీరి సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం అవి రసవత్తరంగా మారడం, కొన్ని సార్లు గొడవలు జరగడం కూడా జరుగుతుంటాయి. కానీ సినీ చరిత్రలో 1977 లో జరిగిన మహా సమరం మాత్రం ఎప్పటికీ మరువ లేనిది. అలాంటి పోటీ అంతకు ముందు.. ఆ తరువాత ఎప్పుడూ జరగలేదు. అసలు ఆ పోటి ఎవరి మధ్య, ఎప్పుడు జరిగిందనే వివరాలలోకి వెళితే..
1976 లో ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ సినిమాను, కృష్ణ కురుక్షేత్రంఅనే సినిమాను పోటా పోటీగా నిర్మించారు. ఆ రెండు చిత్రాలు కూడా పౌరాణిక చిత్రాలే కావడం మరో విశేషం. కృష్ణ సినీ ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో ఉన్న రోజుల్లో ఎన్టీఆర్ తో పోటీ పడ్డారు. వీరిద్దరి మధ్య అంత సఖ్యత కూడా లేని రోజులవి. ఆంధ్ర దేశం అంతా వీరిద్దరి సినిమాల గురించే మాట్లాడుకునే వారు. పత్రికలలో వీరి సినిమాల గురించే ప్రత్యేకంగా ప్రచురించేవారు. దాన వీర శూర కర్ణ సినిమాను అంతా తానై ఎన్‌టీఆర్ నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రాలల్లో నటించారు. కురుక్షేత్రం సినిమాలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల అవుతాయని ఎన్టీఆర్, కృష్ణ వేర్వేరుగా ప్రకటించారు.
ప్రజలందరూ ఈ సినిమాల గురించి ఎంతగానో చర్చించుకునే వారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. 1977 జనవరి 14 సంక్రాంతికి ఈ సినిమాలు విడుదల అయ్యాయి. థియేటర్లను ఎంతగానో అలంకరించారు. గోడలకు ఎటు చూసినాన ఈ రెండు సినిమాల పేర్లే కనిపించేవి. 10 పండుగలను ఒకే రోజు జరుపుకుంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఈ రెండు సినిమాలు విడుదల అయిన రోజున ఆంధ్ర దేశం పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఇక సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి వారం కురుక్షేత్రం సినిమాకు రూ.22 లక్షలు వచ్చాయి. తరువాతి రోజుల్లో ఈ సినిమా అంతగా ఆడలేదు. ఎన్టీఆర్ నటించిన దాన వీర శూర కర్ణ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మహా సంగ్రామంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. ఆ తరువాత కూడా ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు పోటా పోటీగా విడుదల అయినప్పకీ ఈ తరహా పోటీ ఎప్పుడూ లేదు. ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలోనే ఏ హీరోల మధ్య కూడా ఇలాంటి పోటీని ప్రేక్షకులు చూడలేదు.