Sr NTR : ఒక్కోసారి కథ డిమాండ్ ను బట్టి దర్శక నిర్మాతలు సినిమా టైటిల్ పెడుతూ ఉంటారు. మరికొందరు కథకు సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం టైటిల్ ను సెట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకే కథకు పేర్లు మార్చడం కూడా జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే కథలు వేరైనా ఒకే పేరుతో వచ్చిన అనేక సినిమాలు మన చిత్ర పరిశ్రమలో ఉన్నాయి.
ఇలా కథ వేరైనా ఒకే పేరుతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా. తెలుగు తెరకు ఆరాధ్య దైవం అయిన నందమూరి ఎన్టీ రామారావు, అక్కినేనివారి సినీ వారసుడిగా వెండితెరకు పరిచయమైన నాగార్జున చిత్రాలు. ఇరువురు వేర్వేరుగా నటించిన ఎదురులేని మనిషి అనే ఒకే టైటిల్ తో విడుదలైన చిత్రాలు.
కె.బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి 1975 డిసెంబర్ 12 న రిలీజ్ అయ్యింది. చలసాని అశ్వనీదత్ నిర్మాణ సారథ్యం వహించిన తొలి చిత్రమిది. శేఖర్ (ఎన్టీఆర్) తండ్రిని తన బాల్యంలో రంగ మరియు సర్కార్ అనే ఇద్దరు దుర్మార్గులు హత్య చేస్తారు. ఆ హత్య చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకొని శేఖర్ తన తమ్ముడు అయిన గోపితో కలిసి పారిపోతాడు. ఆ తర్వాత శేఖర్ మరియు గోపీలు విడిపోవడం జరుగుతుంది.
ఒకవైపు తండ్రిని చంపిన హంతకుల మీద పగసాధించాలి అన్న పట్టుదల, మరో పక్క దూరమైన తమ్ముడిని ఎలాగైనా కలుసుకోవాలి అని శేఖర్ ప్రయత్నిస్తాడు. ఇక స్మగ్లర్ల కార్యకలాపాలను అడ్డుకుంటూ తన తమ్ముడిని ఎలా కలుసుకున్నాడు అనేది ఎన్టీఆర్ ఎదురులేని మనిషి చిత్ర కథాంశం. 2001లో నాగార్జున హీరోగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎదురులేని మనిషి. ఈ చిత్రంలో నాగార్జున సరసన సౌందర్య, షెహనాజ్ హీరోయిన్స్ గా నటించారు. కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, యమున, అచ్యుత్ ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది. ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో కనిపించారు.
ఊరికి పెద్దమనిషి అయిన సూర్యమూర్తి (నాగార్జున) తన తాత, బామ్మ, ఒక పాపతో కలిసి ఉంటాడు. సూర్య మూర్తి రూపాల్ని పోలి ఉండే అతని తమ్ముడు సత్య హైదరాబాద్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ఊరికి వస్తాడు. ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని భీష్మించుకు కూర్చున్న తన అన్నయ్యకు ఎలాగైనా పెళ్లి చేయాలి అని సత్య భావిస్తాడు. సత్య తన అన్న సూర్యమూర్తిపై పగ పెంచుకున్న వసుంధర (సౌందర్య) ని ఇచ్చి అన్నకు పెళ్లి చేస్తాడు.
వసుంధర సూర్యమూర్తిని తప్పుగా అర్థం చేసుకొని తన తప్పును సరిదిద్దుకునే దిశగా ఈ చిత్ర కథాంశం నడుస్తుంది. అయితే ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ మరియు నాగార్జున చేసిన చిత్రాలలో ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇక నాగార్జున నటించిన ఎదురులేని మనిషి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేకపోయింది.