Cycling : బరువును అదుపులో ఉంచుకోవడానికి మనం రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. మనం ఎక్కువగా చేసే వ్యాయామాల్లో సైక్లింగ్ కూడా ఒకటి. చాలా మంది ఈ వ్యాయామాన్ని అలవాటుగా చేసుకుని ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్కడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే ఉండి మనకు కుదిరినప్పుడు ఇతర సహాయం లేకుండా మనం ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. సైక్లింగ్ చేయడం వల్ల శరీరం ఎక్కువగా అలిసిపోకుండా ఉంటుంది. గుండె మీద కూడా ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది.
అలాగే సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలో పాదాల నుండి ప్రతి అవయవంలో కదలిక జరుగుతుంది. కనుక రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ చక్కగా సరఫరా అవుతుంది. అలాగే గుండె జబ్బులు ఉన్న వారికి ఇది ఒక చక్కటి వ్యాయామనే చెప్పవచ్చు. అదే విధంగా సైక్లింగ్ చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. సైక్లింగ్ చేయడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు మోకాళ్లకు కూడా చక్కటి వ్యాయామం అవుతుంది. అలాగే కాళ్ల బరువు కూడా తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలాగే చాలా మంది పిక్కల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు సైక్లింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి పిక్కల నొప్పులు తగ్గుతాయి. అదే విధంగా వెరికోన్స్ వీన్స్ సమస్యలతో బాధపడే వారికి సైక్లింగ్ ఒక చక్కటి వ్యాయామం అని చెప్పవచ్చు. సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లల్లో కండరాలు బలపడి రక్తం పైకి చక్కగా సరఫరా అవుతుంది. వెరికోన్స్ వీన్స్ వల్ల కలిగే మంటలు, నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
అలాగే మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. సైక్లింగ్ చేయడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే డయాబెటిస్ తో బాధపడే వారు సైక్లింగ్ చేయడం వల్ల వారిలో ఇన్సులిన్ ను నిరోధించే శక్తి తగ్గి ఇన్సులిన్ ను స్వీకరించే శక్తి పెరుగుతుంది. దీంతో డయాబెటిస్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే భవిష్యత్తులో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలనుకునే వారు కూడా సైక్లింగ్ చేయడం మంచిది. మనకు బయట మార్కెట్ లో వ్యాయామం చేయడానికి రకరకాల సైకిల్స్ లభిస్తున్నాయి. వాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకుని వీలైనప్పుడు వాటితో వ్యాయామం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.