Cycling : మనలో చాలా మంది రోజూ వ్యాయామంలో భాగంగా సైక్లింగ్ చేస్తూ ఉంటారు. అలాగే కొందరు ఇప్పటికి బయటకు వెళ్లడానికి సైకిల్స్ నే ఉపయోగిస్తూ ఉంటారు. సైక్లింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. తాజాగా నిపుణులు జరిపిన పరిశోధనల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించబడిన కథనం ప్రకారం సైకిల్ తొక్కడం పర్యావరణానికి మాత్రమే కాకుండా మన మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని వారు చెబుతున్నారు. స్కాట్లాండ్ లో 16 నుండి 74 సంవత్సరాల వయసు గల వారిపై 5 సంవత్సరాల పాటు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. సైకిల్ తొక్కని వారితో పోల్చినప్పుడు సైకిల్ తొక్కే వారిలో 15 శాతం ఆందోళన, డిప్రెషన్ తక్కువగా ఉన్నాయని వారు కనుగొన్నారు.
అలాగే సైకిల్ తొక్కే పురుషుల కంటే మహిళలల్లో మానసిక ఆరోగ్యం మరింత మెరుగ్గా అందని వారు చెబుతున్నారు. కేవలం మానసిక ఆరోగ్యమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని వారు చెబుతున్నారు. సైక్లింగ్ చేయడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. హృదయ కండరాలు బలంగా తయారవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కాళ్లను బలంగా చేయడంలో కండరాలను టోన్ చేయడంలో సైక్లింగ్ మనకు ఎంతో సహాయపడుతుంది. ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండాలనుకునే వారికి సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుంది. సైక్లింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన తక్కువగా పడతారు. మందులు వాడకం తక్కువగా ఉంటుంది. సైక్లింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గుతాయి.
ఆరుబయట సైకిల్ తొక్కడం వల్ల ప్రకృతిని ఆస్వాదించవచ్చు. మానసిక శ్రేయస్సు పెరుగుతుంది. ఈ విధంగా సైక్లింగ్ మన శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అయితే సైక్లింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని కూడా వారు హెచ్చరిస్తున్నారు. సైకిల్ ను ఎల్లప్పుడు సరిగ్గా నిర్వహిస్తూ ఉండాలని, గేర్ లు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని అలాగే ట్రాఫిక్ నియమాలను పాటించాలని వారు చెబుతున్నారు. అలాగే సైక్లింగ్ చేసేటప్పుడు శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అలసటకు గురి కావాల్సి వస్తుంది. అలాగే సైకిల్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే గాయాలు, కండరాల ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే సైకిల్ తొక్కే వారు సరైన పోషకాహారాన్ని కూడా తీసుకోవాలి. ప్రమాదాలను నివారించడానికి సరైన సంకేతాలను ఉపయోగించాలి.