సాధారణంగా కార్యాలయాల్లో డెస్క్ పై కూర్చొని కంప్యూటర్లతో 8 నుండి 10 గంటల పాటు పనిచేసే ఉద్యోగులకు మెడ నొప్పి, భుజాలు లేదా వెన్ను నొప్పి, కళ్ళకు అలసట కలగటం వంటివి వస్తూంటాయి. నిరంతరం కంప్యూటర్ స్క్రీన్ చూడటం లేదా సరి అయిన పద్ధతిలో కూర్చోకపోవడం వలన ఈ సమస్యలు ఏర్పడతాయి. విపరీతంగా బాధించే మెడనొప్పిని తగ్గించుకోడానికిగాను ఆఫీసుల్లోనే చేయదగిన మెడ వ్యాయామాలు కొన్ని పరిశీలిద్దాం. తిన్నగా కూర్చోండి. మీ గడ్డాన్ని ఛాతీ వైపు ఎంతవరకు వంచగలిగితే అంతవరకు అంటే మెడ సాగేటంతవరకు వంచండి. అదే పొజిషన్ లో 15 నుండి 20 సెకండ్లు వుంచండి. దీనిని మూడు లేదా నాలుగు సార్లు చేయండి.
తలను మెడ సాగేటంతవరకు వెనక్కు వంచండి. కళ్ళు పైకి చూడాలి. కొంతసేపు ఈ పొజిషన్ లో వుంచండి. ఈ పొజిషన్ మెడ నొప్పికి చాలా రిలీఫ్ నిస్తుంది. ఎడమ చెవిని ఎడమ భుజానికి ఆనించి మెడను ఎడమవైపుకు సాగతీస్తూ 20 సెకండ్లు వుంచండి. అదే విధంగా కుడి చెవిని కుడి భుజానికి ఆనించి కుడివైపు సాగతీయండి. రెండు వైపులా 4 నుండి 5 మార్లు చేయండి. తలను ఎడమవైపుకు మీరు తిప్పగలిగినంత తిప్పండి 20 సెకండ్లు వుంచండి. కుడివైపు తిప్పండి 20 సెకండ్లు వుంచండి. దీనిని 4 నుండి 5 సార్లు చేయండి. దీనిని త్వరగా చేయటం లేదా గట్టిగా తిప్పటం చేయరాదు. మెడను మెల్లగా తిప్పాలి.
శ్వాస పూర్తిగా లోపలికి తీసుకోండి. మెడను కుడివైపుకు తిప్పండి. సాధారణ స్ధితికి తెస్తూ శ్వాసను వదిలేయండి. దీనినే ఎడమవైపు కూడా చేయండి. మెడను గుండ్రంగా తిప్పటం మంచి వ్యాయామం. పనిలో వున్నపుడు సమర్ధవంతంగా నొప్పిని తగ్గిస్తుంది. దీనిని సవ్యంగాను, అపసవ్యంగాను(క్లాక్ వైజ్ , యాంటీ క్లాక్ వైజ్) కదలికలు చేయాలి. తిప్పినపుడు శ్వాస తీసుకోవడం – సాధారణ స్ధితికి వచ్చినపుడు శ్వాసను వదిలేయడం చేయాలి. అతి సామాన్యమైన ఈ ఆరు వ్యాయామాలను పాటిస్తే మెడ నొప్పి పోవటమే కాక ఎంతో ఫిట్ గా వున్నట్లుగా కూడా అనిపిస్తుంది.