సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌లను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్లను ఎలా తయారు చేశారు, అవి ఎంత ప్రభావం చూపుతాయి, ఎంత డోసులో తీసుకోవాల్సి ఉంటుంది, నిల్వ ఎలా చేస్తారు, వాటి ధర వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాక్సిన్ రకం
చింపాజీలకు వచ్చే సాధారణ జలుబుకు కారణమయ్యే ఎడినోవైరస్‌కు చెందిన బలహీనపర్చిన వైరస్‌ను తీసుకుని కోవిషీల్డ్‌ను రూపొందించారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతోపాటు అక్కడి ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. దీన్ని భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. అలాగే ఇనాక్టివేట్ అయిన కరోనా వైరస్‌తో కోవాగ్జిన్‌ను తయారు చేశారు. దీన్ని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది.
ప్రభావం
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 50 శాతానికి పైగా ప్రభావం చూపే ఏ వ్యాక్సిన్ అయినా సరే వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ క్రమంలోనే ఆ నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ 70.4 శాతం వరకు సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడైంది. అదేవిధంగా కోవాగ్జిన్ 60 శాతం వరకు పనిచేయగలదని తెలిపారు.
డోసేజ్
కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 2 నుంచి 3 నెలల గ్యాప్‌తో రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దాన్ని 4 నుంచి 6 నెలలకు పెంచారు. అదే భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ అయితే ఒక డోసుకు, రెండో డోసుకు మధ్య గ్యాప్ ను 28 రోజులుగా నిర్ణయించారు.
నిల్వ
అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్‌ను -70 డిగ్రీల సెల్సియస్ అతి శీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కానీ కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే చాలు.
ధర
కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రూ.780 ఒక్క డోసుకు వసూలు చేస్తున్నారు. అదే కోవాగ్జిన్ అయితే రూ.1480 వరకు తీసుకుంటున్నారు. అయితే కేంద్రం వీటిని ప్రజలకు ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఎవరైనా ప్రత్యేకంగా కావాలంటే టీకాలను కొనుగోలు చేసి వేయించుకోవచ్చు.
స్టాక్
కోవాగ్జిన్‌కు గాను ఈ ఏడాది చివరి వరకు 70 కోట్ల వరకు డోసులను సిద్ధం చేస్తామని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. కోవిషీల్డ్ కు గాను నెలకు 8 కోట్ల డోసులు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు.