Diabetes : ప్రస్తుత తరుణంలో డయాబెటిస్ సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా చిన్న వయస్సులోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అస్తవ్యస్తమైన జీవనవిధానం వల్లనే చాలా మందిని టైప్ 2 డయాబెటిస్‌ను కొని తెచ్చుకుంటున్నారు. అయితే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు డాక్టర్ల సూచన మేరకు మందులను వాడుకోవడంతోపాటు కింద తెలిపిన 4 చిట్కాలను పాటించాలి. దీంతో షుగర్ లెవల్స్ ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. చాలా మంది రోజూ వ్యాయామం చేయరు. ఎలాంటి శారీరక శ్రమ ఉండదు. దీని వల్లే ఎక్కువగా డయాబెటిస్ సమస్య వస్తుంటుంది. కనుక కచ్చితంగా కొంచెం శారీరక శ్రమ చేయాలి. 30 నిమిషాల పాటు తేలికపాటి నడక అయినా ప్రారంభించాలి. కుదిరితే సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఎరోబిక్స్, బరువులు ఎత్తడం, యోగా వంటివి చేయాలి. దీంతో షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి.
2. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండవు. కనుక పిండి పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తెల్ల అన్నంకు బదులుగా రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి చిరు ధాన్యాలతో చేసిన ఆహారాలను తినాలి. అలాగే టమాటాలు, క్యారెట్, కీర దోస వంటి కూరగాయలను పచ్చిగానే తినాలి. బీట్‌రూట్‌ను కూడా చేర్చుకోవాలి. ఉదయం అల్పాహారంలో ఏదైనా కూరగాయల రసం తాగాలి. మధ్యాహ్నం వెజిటబుల్ సలాడ్ తీసుకోవాలి. రాత్రి పండ్లను చేర్చుకోవాలి. దీంతో పిండి పదార్థాలను తీసుకోవడం తగ్గిపోతుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి.
3. చాలా మంది రోజూ తగినంత నీటిని తాగరు. దీని వల్ల శరీర జీవక్రియలకు ఆటంకం ఏర్పడుతుంది. శరీరంలో ఉండే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు. కనుక రోజై తగినంత నీటిని తాగాలి. ఇది జీవక్రియలకు సహాయ పడుతుంది. షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవడం తేలికవుతుంది.
4. మనం తినే ఆహారాల్లో ఉండే పిండి పదార్థాల స్థాయిని బట్టి అవి మన శరీరంలో గ్లూకోజ్‌గా మారే రేటు ఉంటుంది. ఎక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తింటే మన శరీరంలో గ్లూకోజ్ త్వరగా ఉత్పత్తి అయి షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అలాంటి ఆహారాలను హై గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఉన్నవిగా చెబుతారు. కనుక లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తినాలి. అంటే తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాలు అన్నమాట. వీటిని తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరగవు. కనుక అలాంటి తక్కువ జీఐ విలువ ఉండే ఆహారాలను ఎల్లప్పుడూ తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.