Eggs : కోడిగుడ్లు మన రోజువారీ ఆహార పదార్థాల్లో భాగం అయ్యాయి. ఈ క్రమంలోనే కోడిగుడ్ల వాడకం కూడా ఎక్కువైంది. గుడ్లను కొనుగోలు చేసిన తెచ్చిన తరువాత చాలా మంది వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. తరువాత వాటిని బయటకు తీసి ఉపయోగిస్తుంటారు. ఇలా కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి కొందరు వాటిని తమకు నచ్చిన సమయంలో తీసి వాటితో వంటకాలు చేస్తుంటారు. లేదా ఉడకబెట్టుకుని, ఆమ్లెట్ రూపంలో తింటుంటారు. అయితే వాస్తవానికి కోడిగుడ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్టరాదు. మరి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ చెఫ్ జేమ్స్ మార్టిన్ వివరించారు. ఆయన ఒక బాతు గుడ్డు, ఒక కోడిగుడ్డును కొని తెచ్చి బాతు గుడ్డును ఫ్రిజ్ లో పెట్టకుండానే నేరుగా ఉడికించాడు. తరువాత కోడిగుడ్డును 3 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తీసి దాన్ని కూడా ఉడకబెట్టాడు.
అయితే బాతు గుడ్డు సరిగ్గానే ఉడికింది. కానీ ఫ్రిజ్‌లో ఉంచబడిన కోడిగుడ్డు మాత్రం సరిగ్గా ఉడకలేదు. పైగా అది రుచి కూడా మారింది. దీన్ని బట్టి జేమ్స్ చెబుతున్నది ఏమిటంటే.. గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి చుట్టూ ఉండే పదార్థాల నుంచి వాసన, రుచిలను శోషించుకుంటాయి. దీంతో అలాంటి గుడ్లను తీసి వాడితే వాటి సహజసిద్ధమైన వాసన, రుచి పోతుంది. పైగా అవి సరిగ్గా ఉడకవు. అందుకనే గుడ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదని చెఫ్ జేమ్స్ చెబుతున్నారు. అయితే గుడ్లు ఎక్కువ రోజుల పాటు బయట ఉంటే పాడవుతాయని కొందరికి సందేహం వస్తుంది. అలాంటప్పుడు గుడ్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి తెచ్చి వాడడం మంచిది. అలాగే పొడిగా ఉండే చల్లని ప్రదేశంలో గుడ్లను ఉంచితే అవి ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటాయి. వాటిల్లో ఉండే సహజసిద్ధమైన వాసన, రుచి కోల్పోకుండా ఉంటాయి.
గుడ్లలో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మనకు శక్తిని అందించడంతోపాటు కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. దీంతో కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్నారుల్లో పెరుగుదల సరిగ్గా ఉంటుంది. ఒక కోడిగుడ్డులో దాదాపుగా 6.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల గుడ్లను ప్రోటీన్లకు ఉత్తమమైన వనరు అని చెప్పవచ్చు.
కోడిగుడ్లను రోజూ తీసుకోవడం వల్ల శరీరలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
కోడిగుడ్డు పచ్చని సొనలో విటమిన్ డి ఉంటుంది. అందువల్ల దాన్ని తింటే విటమిన్ డి మనకు సహజసిద్ధంగా లభిస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. గుడ్లను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. తిండి తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది.