అధిక బరువును తగ్గించుకోవడం అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. కొందరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. అయితే కింద తెలిపిన 10 సూచనలను పాటిస్తే దాంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
1. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది టీ, కాఫీలను తాగుతుంటారు. అయితే వాటికి బదులుగా గోరు వెచ్చని నీళ్లను తాగాలి. సాధారణ నీరు అయినా సరే తాగవచ్చు. 1 లీటర్ నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
2. చాలా మంది సాయంత్రం పూట వ్యాయామం చేస్తుంటారు. అయితే ఆరోగ్యం కోసం ఎప్పుడైనా వ్యాయామం చేయవచ్చు. కానీ సమయం ఉంటే ఉదయమే వ్యాయామం చేయడం మంచిది. దీంతో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
3. ఉదయం శరీరంలో 60 శాతం సూర్య రశ్మికి తగిలేలా ఎండలో కనీసం 20 నిమిషాలు ఉండాలి. దీంతో విటమిన్ డి తయారవుతుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
4. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.
5. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. ఉదయం త్వరగా నిద్ర లేవాలి. దీని వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
6. ఉదయం ఇంట్లో చేసిన ఆహారాన్నే తినాలి. బయట వండిన ఆహారాలను తినడం వల్ల శరీరంలో క్యాలరీలు చేరుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
7. రోజూ ఉదయం మీ శరీర బరువును వెయింగ్ మెషిన్‌తో చెక్ చేసుకోవాలి. దీంతో బరువు ఎక్కువగా ఉన్నామని అనిపిస్తుంది. దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు.
8. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకునేందుకు ఉదయం యోగా, ధ్యానం చేయాలి. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు.
9. అంతకు ముందు రోజు తిన్న ఆహారాల ద్వారా ఎన్ని క్యాలరీలు లభించాయో లెక్కించాలి. అందుకు పలు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ముందు రోజు కన్నా తక్కువ క్యాలరీలు వచ్చే ఆహారాలను తీసుకునేందుకు వీలు కలుగుతుంది.
10. ఉదయం చిన్న దూరాలకే చాలా మంది వాహనాలను ఉపయోగిస్తుంటారు. అందుకు బదులుగా కాలి నడకన వెళ్లాలి. లేదా సైకిల్ ఉపయోగించాలి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. ఉదయం వ్యాయామం చేసినట్లవుతుంది. బరువు తగ్గుతారు.