భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని, టీవీ చూస్తూ, పుస్తకాలు చదువుతూ భోజనం చేయరాదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మనం వాటిలో చూస్తూ ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము ? అనే విషయాన్ని గమనించం. దీంతో ఎక్కువ ఆహారాన్ని తింటాము. దీని వల్ల బరువు పెరుగుతారు. ఇక భోజనం చేసేటప్పుడు మాట్లాడితే గ్యాస్ ఏర్పడుతుంది కనుక భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెబుతుంటారు.
అయితే మన శరీరంలో జీర్ణక్రియ అనేది నోట్లోనే ప్రారంభమవుతుంది. తరువాత ఆహారం జీర్ణాశయంలోకి చేరి అక్కడ జీర్ణమవుతుంది. అనంతరం చిన్న పేగులకు ఆహారం చేరుతుంది. ఈవిధంగా జీర్ణక్రియ జరుగుతుంది. కనుక మనం ఆహారం నోట్లో ఉన్నప్పుడే బాగా నమిలి తినాలి. దీంతో జీర్ణాశయంపై తక్కువ భారం పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కనుకనే నోట్లో ఉండే ఆహారాన్ని చాలా సార్లు నమిలి తినాలని కూడా వైద్యులు చెబుతుంటారు.
ఇక ఆహారాన్ని నమిలి తినే విషయానికి వస్తే నిత్యం మనం తినే కూరగాయలు, అన్నం, ఇతర పదార్థాలను కనీసం 32 సార్లు నమిలి తినాలి. అదే మాంసాహారం అయితే కనీసం 50 సార్లు నమలాలి. నీటితో నిండిన కూరగాయలు, పండ్లు అయితే 15 సార్లు నమిలి తింటే చాలు. ఈ విధంగా ఆహారాలను బట్టి వాటిని నోట్లో నిర్దిష్టమైనన్ని సార్లు నమిలి తినాల్సి ఉంటుంది. దీనివల్ల ఆహార పదార్థాలు సులభంగా జీర్ణం అవుతాయి.
అయితే ఆహారాన్ని పైన చెప్పినన్ని సార్లే ఎందుకు నమలాలి ? అంటే.. దీన్ని మేం చెప్పడం లేదు, సైంటిస్టులు చెబుతున్నారు. ఏ ఆహారాన్ని అయినా సరే కనీసం 32 సార్లు నమిలి తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కనుకనే ఆహార పదార్థాలను అన్ని సార్లు నమిలి తినాల్సి ఉంటుంది.