మన శరీరంలో అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడాలంటే అందుకు నీరు ఎంతగానో అవసరం. మన దేహంలో సుమారుగా 50 నుంచి 70 శాతం వరకు ఉండేది నీరే. రక్తంలో 83 శాతం, కండరాల్లో 75 శాతం, ఎముకల్లో 22 శాతం, మెదడులో 74 శాతం వరకు నీరు ఉంటుంది. అలాగే ఇతర అవయవాల్లో నీరు ఉంటుంది. కనుక నీరు మనకు చాలా అవసరం. రోజూ తగిన మోతాదులో నీటిని తాగాల్సి ఉంటుంది.
ఇక ఆయుర్వేద చెబుతున్న ప్రకారం పురుషులు రోజుకు 2.50 లీటర్ల నీటిని, స్త్రీలు రోజుకు 2 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. నీటిని తాగే విషయంలోనూ ఆయుర్వేద ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* నీళ్లను ఎల్లప్పుడూ నిలబడి తాగరాదు. కూర్చుని తాగాలి. దీంతో మనం తాగే నీటిని శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
* నీటిని ఒకేసారి పెద్ద పెద్ద గుక్కల్లో తాగరాదు. కాఫీ, టీ లు తాగినట్లు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. దీంతో నీరు రక్తంలో సులభంగా కలుస్తుంది. జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి.
* గది ఉష్ణోగ్రత వద్ద లేదా గోరు వెచ్చగా ఉన్న నీటినే ఎల్లప్పుడూ తాగాల్సి ఉంటుంది. చల్లని నీటిని తాగరాదు. చల్లని నీళ్లను తాగుతూ ఉంటే దీర్ఘకాలంలో ఎక్కువ సమస్యలు వస్తాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కావచ్చు. కనుక చల్లని నీళ్లను తాగరాదు.
* రోజూ తగినంత నీటిని తాగడంతోపాటు దాహం ఎప్పుడు అయితే అప్పుడు నీటిని తాగాలి. దాహం అవుతున్నా ఎక్కువ సేపు అలాగే ఉండరాదు. లేదంటే తలనొప్పి సమస్య వస్తుంది.
* మూత్రం లేత పసుపు లేదా తెలుపు రంగులో ఉంటే నీటిని బాగా తాగుతున్నట్లు అర్థం. పసుపు రంగులో ఉంటే డీహైడ్రేషన్ బారిన పడ్డారని అర్థం. అలాంటి వారు ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది.
* తగినంత నీటిని తాగకపోతే పెదవులు పొడిబారతాయి. దీన్ని బట్టి శరీరానికి నీళ్లు కావాలని అర్థం చేసుకోవచ్చు.
* భోజనం చేయడానికి 45 నిమిషాల ముందు, చేశాక 45 నిమిషాల తరువాత మాత్రమే నీటిని తాగాలి. భోజనం సమయంలో నీటిని తాగితే జీర్ణ రసాలకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవదు. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వస్తాయి.
* భోజనం చేశాక వెంటనే నీళ్లను తాగాలని అనిపిస్తే.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత పళ్ల రసాలను తాగాలి. మధ్యాహ్నం భోజనం అనంతరం మజ్జిగను, రాత్రి భోజనం అనంతరం పాలను తాగవచ్చు.
* 18 ఏళ్ల లోపు వయస్సు వారు ఉదయం పరగడుపునే 1 గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగితే మంచిది. 18 ఏళ్లకు పైబడిన వారు పరగడుపునే 3 గ్లాసుల గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో గ్యాస్, మలబద్దకం ఉండవు. సుఖ విరేచనం అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* రోజూ నీటిని తగిన మోతాదులో తాగడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్లు ఏర్పడవు. మలబద్దకం, తలనొప్పి వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
నీటిని తాగే విషయంలో ఆయుర్వేద ప్రకారం ఈ విధంగా నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. చాలా వరకు అనారోగ్యాలను ఈ నియమాలను పాటించి తగ్గించుకోవచ్చు.