ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు ప్రస్తుతం అనేక రంగాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆధునిక పద్ధతులను అన్ని చోట్లా అనుసరిస్తున్నారు. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మగ వాళ్ల కన్నా ఎక్కువగానే అన్ని విధాలుగా మహిళలు రాణిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. నిత్యం వారు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండడం లేదు. దీనిపై అనేక మందికి అవగాహన ఉండడం లేదు. ముఖ్యంగా విటమిన్ సి ని తీసుకుంటే చాలా మంది మహిళలు ఈ విటమిన్‌ను నిత్యం పొందడం లేదు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు, ఇతర ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తుంది.
విటమిన్ సి లోపిస్తే అనారోగ్య సమస్యలు
విటమిన్ సి నీటిలో కరుగుతుంది. అందువల్ల శరీరం దీన్ని నిల్వ చేసుకోలేదు. కనుక నిత్యం ఈ విటమిన్‌ను శరీరానికి అందేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఆహారం లేదా సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా విటమిన్ సి శరీరానికి అందేలా చూసుకోవచ్చు. దీంతో ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. నిత్యం మహిళలు తగినంత విటమిన్ సి ని తీసుకోకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
జీవనశైలి వ్యాధులు
అయితే విటమిన్ సి అనేది నిత్యం ఎవరికైనా అవసరమే. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మహిళలకు ఆ విటమిన్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మహిళలు రోజు మొత్తం పనిచేస్తూనే ఉంటారు. కనుక విటమిన్ సి తీసుకోవడం తప్పనిసరి. లేదంటే జీవనశైలి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే.. డయాబెటిస్ బారిన పడతారు. అందువల్ల విటమిన్ సి ని నిత్యం తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
కొల్లాజెన్, గర్భధారణ సమస్యలు
విటమిన్ సి ని తగినంత తీసుకోవడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ముఖంపై వచ్చే ముడతలను నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలను రాకుండా చూస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. అందువల్ల మహిళలు విటమిన్ సి ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గర్భిణీలు విటమిన్ సి నిత్యం తీసుకోవడం వల్ల శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. గర్భధారణ సమస్యలు రాకుండా ఉంటాయి.
నెలసరి, గుండె జబ్బులు
ఒత్తిడిని బాగా ఎదుర్కొనే మహిళల్లో సహజంగానే హార్మోన్లపై ప్రభావం పడుతుంది. దీంతో నెలసరి సరిగ్గా అవదు. ఫలితంగా సంతాన లోపం సమస్య ఏర్పడుతుంది. అలాగే జీర్ణక్రియ గాడి తప్పుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఈ క్రమంలోనే విటమిన్ సి ని తీసుకుంటే ఆయా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే హైబీపీ తగ్గుతుంది. మహిళల్లో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
రక్తహీనత
పురుషుల కన్నా స్త్రీలలోనే రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాంటి వారు విటమిన్ సి ని నిత్యం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే విటమిన్ సి మనం తినే ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం గ్రహించేలా చేస్తుంది. దీంతో ఐరన్ బాగా అంది రక్తం బాగా తయారవుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య ఉండదు. ఐరన్ లోపం సమస్య కూడా తగ్గుతుంది.
కొలెస్ట్రాల్
విటమిన్ సి వల్ల శరరీంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. గర్భాశయ సమస్యలు పోతాయి. రుతుక్రమం సరిగ్గా ఉంటుంది.
బాలికలు, మహిళలకు రోజూ ఎంత విటమిన్ సి అవసరం ?
* 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలు నిత్యం 66 ఎంజీ మోతాదులో విటమిన్ సి ని తీసుకోవాల్సి ఉంటుంది.
* 16 నుంచి 18 ఏళ్లు ఉన్న బాలికలకు 68 మిల్లీగ్రాముల విటమిన్ సి రోజుకు అవసరం అవుతుంది.
* మహిళలు రోజుకు 65 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ సి ని తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ సి ఉండే ఆహారాలు
విటమిన్ సి ఎక్కువగా.. టమాటాలు, కివీలు, క్యాబేజీ, నారింజ, నిమ్మ, ఉసిరికాయలు, క్యాప్సికం, అరటి పండ్లు, అన్ని రకాల బెర్రీలు, పైనాపిల్, జామ కాయలు, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ, పచ్చి బఠానీలు, మామిడి కాయలు.. తదితర ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తరచూ తినడం వల్ల విటమిన్ సి సరిగ్గా అందుతుంది. ఈ విటమిన్ లోపం రాకుండా ఉంటుంది. మహిళలు వీటిని తరచూ ఆహారంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.