పాలు సంపూర్ణ పోషకాహారం. చాలా మంది నిత్యం పాలను తాగుతుంటారు. చిన్నారులకు తల్లిదండ్రులు రోజూ కచ్చితంగా పాలను తాగిస్తారు. అయితే నిత్యం పాలను 1 లీటర్ వరకు తాగవచ్చా ? తాగితే ఏం జరుగుతుంది ? అంటే..
మన శరీరానికి స్థూల పోషకాలైన కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు), ప్రోటీన్లు (మాంసకృత్తులు), కొవ్వులు (ఫ్యాట్స్) నిత్యం అవసరం అవుతాయి. ఆయా పదార్థాలు కలిగిన ఆహారాలను నిత్యం మనం తీసుకుంటే పోషణ అందుతుంది. అయితే ప్రోటీన్లను ఎక్కువగా వృక్ష సంబంధమైన పదార్థాల నుంచి వచ్చేలా చూసుకుంటే మంచిది. జంతు సంబంధ పదార్థాలైన మాంసం, పాలు, గుడ్ల ద్వారా మనకు ప్రోటీన్లు లభిస్తాయి. కానీ నిత్యం లభించే ప్రోటీన్లలో జంతు సంబంధ పదార్థాలతో లభించే ప్రోటీన్ల మోతాదు 5 శాతం కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే నిత్యం పాలు, మాంసం, గుడ్లను తీసుకుంటే చాలా చాలా తక్కువ మోతాదులో వాటిని తీసుకోవాలన్నమాట. ఎక్కువగా తీసుకోరాదు. ప్రోటీన్లు ఎక్కువగా కావాలనుకుంటే వృక్ష సంబంధ పదార్థాలపై ఆధార పడాలి.
జంతు సంబంధ పదార్థాలను నిత్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. అయితే వాటితోపాటు కొవ్వులు కూడా ఎక్కువగా అందుతాయి. దీంతో డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ టి.కొలిన్ క్యాంప్‌బెల్ అనే సైంటిస్టు ప్రోటీన్లపై అనేక ఏళ్ల పాటు అధ్యయనం చేసి పై వివరాలను వెల్లడించారు. కనుక పాలను నిత్యం తాగవచ్చు. కానీ 1 లీటర్ అంటే చాలా ఎక్కువ. 200 ఎంఎల్ మోతాదులో తీసుకుంటే చాలు. అదే గుడ్డు అయితే 1, మాంసం అయితే 75 గ్రాముల మోతాదు చాలు. ఈ విధంగా జంతు సంబంధ పదార్థాలను తీసుకున్నా అనారోగ్య సమస్యలు రావు.