నిత్యం మన శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేయడంలో మన శరీర రోగ నిరోధక వ్యవస్థ ఎంతో కష్టపడుతుంటుంది. ఈ క్రమంలోనే తెల్ల రక్త కణాలతో కలిసి ఆ వ్యవస్థ వ్యాధికారక సూక్ష్మ క్రిముల పని పడుతుంది. అయితే శరీరంలో ఎవరికైనా సరే ఒక మైక్రో లీటర్‌కు కనీసం 5వేల నుంచి 10వేల వరకు తెల్ల రక్త కణాలు ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉంటే ఇబ్బందులు కలుగుతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వస్తాయి. అయితే తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకుంటే రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేయించవచ్చు. ఈ క్రమంలోనే కింది ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
విటమిన్ ఇ వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిత్యం 60 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ ఇ మనకు అందేలా చూసుకోవాలి. అందుకు గాను విటమిన్ ఇ ఉండే ఆహారాలను తినాలి. బాదంపప్పు, అవకాడో, కొత్తిమీర, చేపలు, గుమ్మడికాయ విత్తనాలు తదితర ఆహారాలను తినడం ద్వారా విటమిన్ ఇ మనకు లభిస్తుంది. దీంతో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకోవచ్చు.
నిత్యం 15 నుంచి 20 మిల్లీగ్రాముల మోతాదులో మనకు జింక్ అవసరం. జింక్ ఎక్కువగా సీఫుడ్, తృణ ధాన్యాలు, పాలు, పాల సంబంధ ఉత్పత్తులు, గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు విత్తనాలు తదితర ఆహారాల్లో మనకు లభిస్తుంది. జింక్ ఉన్న ఆహారలను తినడం వల్ల కూడా శరీరంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి.
సెలీనియం మనకు నిత్యం 200 ఎంసీజీ మోతాదులో అవసరం అవుతుంది. ఇది చేపలు, చికెన్, యాపిల్స్, వెల్లుల్లి, టమాటాలు, గుమ్మడికాయ విత్తనాలు తదితర ఆహారాల్లో మనకు లభిస్తుంది. సెలీనియం ఉన్న ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. అలాగే శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతాయి.
విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ సి వల్ల తెల్ల రక్త కణాల సంఖ్య సులభంగా పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. నారింజ, కివీలు, నిమ్మ కాయలు, క్యాప్సికం వంటి ఆహారాల ద్వారా మనకు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
టమాటాలు, నారింజ, బొప్పాయి, చిలగడ దుంపలు, క్యారెట్లు, యాపిల్స్ వంటి పదార్థాల్లో కెరోటినాయడ్స్ ఉంటాయి. ఇవి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. శరీరంలో కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. హార్ట్ అటాక్‌లు రాకుండా చూస్తాయి.
చేపలు, అవిసె గింజెలు, నట్స్‌లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అలాగే తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడంలో దోహదపడతాయి.
శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మాత్రమే కాదు, తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచేందుకు కూడా విటమిన్ ఎ ఉపయోగపడుతుంది. ఇది మనకు యాపిల్స్, క్యారెట్లు, పాలకూర తదితర ఆహారాల్లో లభిస్తుంది.
ఇవే కాకుండా వెల్లుల్లి రెబ్బలు, బొప్పాయి ఆకుల రసం తదితర పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండి మెరుగ్గా పనిచేస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365