Food Combinations : సాధారణంగా మనం రోజూ అనేక పదార్థాలను తింటుంటాం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు రకరకాల ఆహారాలను తీసుకుంటుంటాం. వాటిల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, పండ్లు.. ఇలా రకరకాల ఆహారాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం ఎల్లప్పుడూ కలిపి తీసుకోరాదని.. అలాగే వాటిని తిన్న వెంటనే కొన్ని పదార్థాలను తినకూడదని.. ఆయుర్వేదం చెబుతోంది. మరి ఏయే రకాల ఫుడ్ కాంబినేషన్లు మంచివి కావో ఇప్పుడు తెలుసుకుందామా..!
చికెన్, పాలు, మటన్ కలిపి తీసుకోరాదు. చికెన్ తిన్న తరువాత పాలను అస్సలు తాగరాదు. లేదా పాలు తాగాక చికెన్ తినరాదు. తింటే రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కనుక అవి జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొందరికి అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, విరేచనాలు వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ కాంబినేషన్ తీసుకోరాదు.
అలాగే పాలు తాగిన తరువాత పెరుగు, జున్ను, కోడిగుడ్లు, చేపలు, వేడిగా ఉండే పానీయాలను తీసుకోరాదు.
ముల్లంగితో అరటిపండ్లు, ఎండు ద్రాక్ష, పాలను తీసుకోరాదు.
పుచ్చకాయతో ద్రవ పదార్థాలు, నీళ్లు, వేపుళ్లు తీసుకోరాదు.
బీన్స్‌తో జున్ను, కోడిగుడ్లు, చేపలు, పెరుగు, పండ్లు తీసుకోరాదు.
వేడి పానీయాలతో మామిడి పండ్లు, జున్ను, చేపలు, పెరుగు వంటి ఆహారాలను తీసుకోకూడదు. టీ తాగాక పెరుగును తీసుకోరాదు.
నిమ్మకాయ వంటి పుల్లని పండ్లతో దోసకాయలు, పాలు, టమాటాలు, పెరుగు వంటి ఆహారాలను తీసుకోరాదు.
కోడిగుడ్డుతో జున్ను, చేపలు, పాలు, పెరుగు తీసుకోరాదు. చిరు ధాన్యాలు, గింజలతో పండ్లను తినరాదు. అలాగే తేనె, నెయ్యి కాంబినేషన్ కూడా మంచిది కాదు. పాలు, అరటి పండ్లను కలిపి తీసుకోరాదు. ఒకటి తీసుకున్న తరువాత కూడా ఇంకో దాన్ని తీసుకోరాదు. కనీసం గంట సమయం వేచి ఉండాలి. ఆ తరువాతే తీసుకోవాలి.
పైన తెలిపిన ఫుడ్ కాంబినేషన్లను తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అజీర్ణం, మలబద్దక, విరేచనాలు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తలనొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, వికారం, వాంతులు, పుల్లని త్రేన్పులు, నిద్ర పట్టకపోవడం, మత్తుగా ఉండడం, చర్మంపై దురదలు, దద్దుర్లు రావడం.. వంటి సమస్యలు వస్తాయి. కనుక పైన తెలిపిన ఫుడ్ కాంబినేషన్లను అస్సలు తీసుకోరాదు.