గ్రీన్ టీ.. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే.. అమృతం అనే అనవచ్చు. ఎందుకంటే ఇది అందించే లాభాలు అలాంటివి మరి. ఈ టీలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మనకు అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన పానీయాల్లో గ్రీన్ టీ కూడా ఒకటి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల అనేక వ్యాధుల నుండి మనకు రక్షణ లభిస్తుంది. అలాగే కణాల నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ఇతర అనేక ప్రయోజనాలను మనకు గ్రీన్ టీ అందిస్తుంది. ఇందులో అనేక ఆరోగ్యకరమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల మనకు ఈ టీ అద్భుతమైన లాభాలను అందిస్తుంది.
గ్రీన్ టీ ని నిత్యం తాగడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలివే…
గ్రీన్ టీ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. ఈ టీలో ఉండే పాలీఫినాల్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. వాటి పెరుగుదలను నివారిస్తాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు మూత్రాశయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము, చర్మం, కడుపు, అండాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
గ్రీన్ టీలో ఎల్-థియనిన్ ఉంటుంది. ఇది సెరొటోనిన్ (హ్యాపీ హార్మోన్), డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అప్రమత్తతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అలాగే ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు. నిత్యం ఒక సోడా తాగే బదులు 1 నుంచి 2 కప్పుల గ్రీన్ టీని ఏడాది పాటు తాగితే ఏకంగా 50వేల క్యాలరీలను శరీరంలో చేరకుండా చూసుకోవచ్చని సైంటిస్టుల అధ్యయనాలు వెల్లడించాయి. సోడాలు, శీతల పానీయాలకు బదులుగా ఈ ఆరోగ్యకరమైన టీని ఎంచుకుంటే బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజం కూడా పెరుగుతుంది. కొవ్వును కరిగించేందుకు ఇది సహాయ పడుతుంది.
నిత్యం ఒక కప్పు గ్రీన్ టీని తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు 42 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ రక్తపోటును తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
శరరీంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కాటెచిన్స్ యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. అందువల్ల వృద్ధాప్య ఛాయలు రావు. ముఖంపై చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. గ్రీన్ టీ సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు తొలగించబడతాయి. రక్తం శుభ్రంగా మారుతుంది. ప్రకాశవంతమైన చర్మం లభిస్తుంది. అలాగే దంత క్షయం సమస్య ఉండదు. నోట్లో బాక్టీరియా నాశనమవుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది.
నిత్యం ఆరోగ్యకరమైన పానీయాలను తాగాలని అనుకుంటే వాటిల్లో గ్రీన్‌టీని తప్పక చేర్చుకోవాలి. దీని వల్ల పైన తెలిపిన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.