మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. తగినన్ని గంటల పాటు నిద్రించాలి. అంతేకాదు, రోజూ తగిన మోతాదులో నీటిని కూడా తాగాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మనం రోజూ తగిన మోతాదులో నీటిని తాగకపోతే మన శరీరం మనకు పలు సూచనలు, సంకేతాలు ఇస్తుంటుంది. వాటిని గమనించడం ద్వారా మనం నీళ్లను ఎక్కువగా తాగడం లేదని తెలుస్తుంది. దీంతో నీళ్లను తగినంత మోతాదులో తాగుతూ ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి నీళ్లను ఎక్కువగా తాగకపోతే మన శరీరం చూపించే ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మనం తగినంత నీటిని తాగకపోతే శరీరంలో ద్రవాలు సరిగ్గా ఉండవు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతారు. అప్పుడు శరీరం అత్యవసర స్థితిలోకి వెళ్లిపోతుంది. గ్లైకోజన్‌ను అలాగే ఉంచుతుంది. దీంతో ఆకలి అవుతుంది. ఆకలి బాగా అవుతుంది అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి నీళ్లను బాగా తాగకపోవడం. రెండు షుగర్ ఉండడం. రెండోది కారణం కాకపోతే కచ్చితంగా మొదటిదే కారణమని భావించాలి. అంటే.. నీళ్లను బాగా తాగాలన్నమాట.
2. నీళ్లను తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో మూత్రం ముదురు పసుపు రంగు లేదా గోధుమ రంగులో వస్తుంది. ఇలా వస్తుందంటే శరీరానికి నీరు అవసరమని గుర్తించాలి. వెంటనే నీటిని తాగాల్సి ఉంటుంది.
3. శరీరంలో ద్రవాలు సరిగ్గా లేకపోతే నోరు తడారిపోతుంది. దీంతో నోట్లో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫలితంగా నోటి దుర్వాసన వస్తుంది. ఇలా జరుగుతుందంటే నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది.
4. నీళ్లను తక్కువగా తాగితే రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తం సరఫరా తగ్గుతుంది. దీంతో శరీర భాగాలు, కణాలకు రక్తం సరిగ్గా అందదు. ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. దీంతో తలతిరగడం, తలను సుత్తితో బలంగా కొట్టినట్లు అనిపించడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే వెంటనే నీళ్లను తాగాల్సి ఉంటుంది.
5. శరీరంలో తగినంత నీరు లేకపోతే తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి. చిన్న పనికే బాగా అలసిపోతారు. ఈ సంకేతాలు కనిపిస్తుంటే నీళ్లను తాగడం లేదని అర్థం చేసుకోవాలి. వెంటనే నీళ్లను తాగాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.