Aratikaya Masala Kura : మనం పచ్చి అరటి కాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి అరటి కాయలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పచ్చి అరటి కాయను తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణశక్తి వేగవంతం అవుతుంది. ఈ పచ్చి అరటి కాయలతో చిప్స్, కూర వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. పచ్చి అరటి కాయలతో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. సలుభంగా, రుచిగా పచ్చి అరటి కాయలతో మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి కాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి అరటి కాయలు – 2, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పోపు దినుసులు – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1.
అరటి కాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక అరటి కాయలను మెత్తగా ఉడికించాలి. తరువాత వాటిపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో నువ్వులు, ధనియాలు, పల్లీలు, ఎండు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అరటి కాయ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో బిర్యానీ ఆకు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. తరువాత మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి నూనె పైకి తేలే వరకు కలుపుతూ వేయించాలి.
తరువాత వేయించిన అరటి కాయ ముక్కలు, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత చింతపండు రసం, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో 4 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అరటికాయ మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పచ్చి అరటి కాయలతో కూరను చేసుకుని తినడం వల్ల పచ్చి అరటికాయను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.