Banana Dry Fruits Milkshake : బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్.. అరటిపండ్లు, డ్రై ఫ్రూట్స్ తో చేసే ఈ మిల్క్ షేక్ చాలారుచిగా ఉంటుంది. పిల్లలు ఈ మిల్క్ షేక్ ను ఇష్టంగా తాగుతారని చెప్పవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల మనకు తక్షణ శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత తగ్గుతుంది. ఈ మిల్క్ షేక్ లో అరటిపండ్లకు బదులుగా ఇతర పండ్లను కూడా వేసుకోవచ్చు. పండ్లు తినని పిల్లలకు ఇలా మిల్క్ షేక్ చేసి ఇవ్వడం వల్ల వారికి పోషకాలన్నీ చక్కగా అందుతాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – ఒకటిన్నర కప్పు, అరటిపండ్లు – 2, జీడిపప్పు – 6, పంచదారలేదా పటిక బెల్లం – 3 టీ స్పూన్స్, యాలకులు – 3, నానబెట్టి పొట్టు తీసిస కట్ చేసిన బాదం – 10, చిన్నగా తరిగిన అరటిపండు – 1, నానబెట్టిన సబ్జా గింజలు – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్.
బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా పాలను కాచి చల్లార్చి ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత ఈ పాలను జార్ లో వేసుకోవాలి. ఇందులోనే అరటి పండ్లను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత జీడిపప్పు, పంచదార, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బాదంపప్పు ముక్కలు, అరటిపండు ముక్కలు, సబ్జా గింజలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.