ఎండాకాలంలో సహజంగానే పిల్లలు ఇండ్లలో తినే పదార్థాల కోసం చూస్తుంటారు. అసలే బయట ఎండగా ఉంటుంది కనుక పిల్లలు సాధారణంగా బయటకు వెళ్లకుండా.. తమ తమ ఇండ్లలో ఉండే తినుబండారాలను తినేందుకే ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఈ క్రమంలోనే పెద్దలు కూడా వారికి సాంప్రదాయ తినుబండారాలను చేసి పెట్టాలని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి బొబ్బర్ల వడలు. వీటిని చాలా త్వరగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి. ఈ క్రమంలో బొబ్బర్ల వడలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
బొబ్బర్ల వడలు తయారీకి కావల్సిన పదార్థాలు:
బొబ్బర్లు – 2 కప్పులు, పచ్చిమిర్చి – 4, అల్లం – చిన్నముక్క, జీలకర్ర – 1 టీస్పూన్, కొత్తిమీర – 1/4 కప్పు, కరివేపాకు – 1/4 కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా.
బొబ్బర్ల వడలను తయారుచేసే విధానం:
బొబ్బర్లను 6 గంటల పాటు బాగా నానబెట్టాలి. అవి నానాక నీళ్లు పారబోసి మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, బొబ్బర్లు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. మెత్తగా రుబ్బితే వడలు స్మూత్ గా వస్తాయి. అది వద్దనుకుంటే ఆ మిశ్రమాన్ని కచ్చా పచ్చాగానే రుబ్బాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలిపి వడల్లా గుండ్రంగా చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి. దీంతో ఘుమ ఘుమ లాడే బొబ్బర్ల వడలు రెడీ అవుతాయి. వీటిని అలాగే తినవచ్చు. లేదా కొబ్బరి, టమాటా, పల్లి చెట్నీలో తినవచ్చు.