నిజంగా రవ్వ వెనకాల ఇంతుందని నాకూ తెలీదు. మీకోసం చదివి తెల్సుకుని రాస్తున్నదే ఇది. రవ్వని ఇంగ్లీషువారు ఇస్టైలుగా సెమోలిన అంటారు. మన ఆసియాలో ముఖ్యంగా ఇండియా, పాక్ లలో సూజీ(హిందీ లో) అని రవ్వ అని పిలుచుకుంటాం. మూడు ఒక పదార్ధం పేరే. ఇంతకీ ఏమిటది. గోధుమ గింజని బరకగా దంచితే వచ్చే ముక్కలు అన్నమాట. మామూలుగా అయితే దీన్ని దారుం (darum) రకం గోధుమతో చేస్తారు. దీన్నే పాస్తా గోధుమ అని, మేకరోని గోధుమ అని కూడా పిలుస్తారు. ఇది టర్కీ ప్రాంతపు గోధుమ రకం. ఇది అన్ని గోధుమల్లోకి గింజ గట్టిగా ఉండే రకం అందుచేత పిండిగా చేయటం కష్టమూ, అలా చేసిన పిండి ఏమంత గట్టిదనం లేక మెతగ్గా ఉంటుంది. రొట్టెలకు కావలసినంత జిగురు ఉండదు.
ఈ రవ్వని గోధుమ గింజల పైనున్న పొట్టు తీసేసి మిల్లులో దంచుతారు. అందుకని దీనిలో పీచు తక్కువగా ఉంటుంది. నిజానికి రవ్వ మంచిదని అనుకుంటారు కానీ పోషక విలువల్లో రవ్వ మైదాని ఎక్కువ పోలి ఉంటుంది. గోధుమ పిండి ఈ రెంటికన్న మెరుగైనది.
ఇక ఇంకో రవ్వ కూడా బజార్లో దొరుకుతుంది. దీనిపేరు బన్సీ రవ్వ. ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. దీన్ని సాంబ గోధుమల తో చేస్తారు అని రాసారు కానీ, సాంబ గోధుమ బాగా ముదురు రంగులో ఉండే రకం. ఇందులోనే ఇంకో రకం చిరోటి రవ్వ. ఇది కర్ణాటక లో ఎక్కువ తయారయ్యే స్వీట్ పేరుతో కనిపిస్తుంది. ఇది కూడా బన్సీ రవ్వ రూపాంతరమే.