Brinjal Green Peas Fry : మనం వంకాయలతో రకరకాల కూరలను, వేపుళ్లను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ పచ్చిబఠాణీ ఫ్రై కూడా ఒకటి. వంకాయలు, పచ్చి బఠాణీ కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటితో తినడానికి ఈ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. మసాలాలు ఎక్కువగా వాడకుండా రుచిగా ఈ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పచ్చి బఠాణీ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పచ్చి బఠాణీ – అర కప్పు, చిన్న ముక్కలుగా తరిగిన వంకాయలు – పావుకిలో, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ పచ్చి బఠాణీ ఫ్రై తయారీ విధానం..
ముందుగా వంకాయలను కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత బఠాణీలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వంకాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
తరువాత కారం, పసుపు వేసి కలపాలి. వీటిని మరో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చి బఠాణీ ఫ్రై తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయలతో ఎప్పుడూ ఒకేరకం కూరలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.