సాధారణంగా మనం ఏం కూర వండాలో దిక్కుతోచని సమయంలో వివిధ రకాల రైస్ రెసిపీ లను తయారు చేసుకోవడం చేస్తుంటాము. ఇలాంటి రెసిపీలలో ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ కూడా ఒకటి. మరి నోరూరించే క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
రెండు కప్పులు అన్నం, క్యాప్సికమ్ 2, ఆవాలు అర టేబుల్ స్పూన్, జీలకర్ర అర టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి పొడి అర కప్పు, శెనగపప్పు అర టీ స్పూన్, వేరుశనగపప్పు అర కప్పు, మినప్పప్పు అర టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా మనం అన్నం తయారు చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా క్యాప్సికమ్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచి అందులోకి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత వేరుశెనగ పప్పు వేసి వేయించాలి. వేరుశెనగ కొద్దిగా వేగిన తరువాత మినప్పప్పు, శెనగపప్పు వేసి వేయించాలి. శనగపప్పు కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న క్యాప్సికం ముక్కలు వేయాలి. ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించిన తరువాత చిటికెడు పసుపు ఉప్పు వేసి రెండు నిమిషాలు మూత పెడితే క్యాప్సికం మెత్తగా అవుతాయి. ఆ తరువాత నిమ్మరసం, కొబ్బరి పొడి వేసి కలియ పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ముందుగా తయారుచేసి పెట్టుకున్న అన్నం వేసి కలియబెట్టికొని ఆపై కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికం రైస్ తయారైనట్లే.