Cauliflower Avakaya : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాలీప్లవర్ కూడా ఒకటి. క్యాలీప్లవర్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. క్యాలీప్లవర్ తో మనం రకరకాల కూరలను, వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కూరలే కాకుండా క్యాలీప్లవర్ తో ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీప్లవర్ ఆవకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – 2, ఆవపిండి – పావు గ్లాస్, ఉప్పు – పావు గ్లాస్, కారం – అర గ్లాస్, నిమ్మకాయలు – 4, పల్లీ నూనె – ముప్పావు గ్లాస్.
క్యాలీ ప్లవర్ పచ్చడి తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ లను పెద్ద ముక్కలుగా తరగాలి. తరువాత వీటిని ఉప్పు నీటితో బాగా కడగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని అందులో క్యాలీప్లవర్ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు ఉంచి ఉంచాలి. ఇప్పుడు ఈ క్యాలీ ప్లవర్ ముక్కలను ఒక కాటన్ వస్త్రం మీదకు తీసుకుని పూర్తిగా ఆరిపోయే వరకు ఎండలో ఉంచాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తో ఈ ముక్కలను కొలిచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముక్కలను కొలిచిన గ్లాస్ తో ఉప్పు, కారం, ఆవ పిండిని తీసుకుని ముక్కల్లో వేసి కలపాలి. తరువాత అదే గ్లాస్ తో నూనెను కొలిచి ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేదా గాజు సీసాలోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని ఒక రోజంతా అలాగే ఉంచి ఊరనివ్వాలి. మరుసటి రోజూ ఈ పచ్చడిని వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ ఆవకాయ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాలీప్లవర్ తో కూరలనే కాకుండా ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.