Chapati Egg Roll : మనకు బయట ఎక్కువగా దొరికే ఆహార పదార్థాల్లో ఎగ్ రోల్స్ కూడా ఒకటి. ఎగ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. అయితే ఈ ఎగ్ రోల్స్ ను తయారు చేయడానికి ఎక్కువగా మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటారు. మైదా పిండిని ఎక్కువగా తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక ఈ ఎగ్ రోల్స్ ను ఆరోగ్యానికి మేలు చేసే విధంగా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసే ఎగ్ రోల్స్ కూడా చాలా రుచిగా మెత్తగా ఉంటాయి. గోధుమ పిండితో ఎగ్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీ ఎగ్ రోల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చపాతీ పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పంచదార – చిటికెడు, వెన్న – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని, నూనె – అర కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన క్యాప్సికం ముక్కలు – అర కప్పు, క్యాబేజ్ తురుము – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, మిరియాల పొడి – అర టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ – అర టీ స్పూన్, కోడిగుడ్లు – 4, టమాట కెచప్ – కొద్దిగా.

చపాతీ ఎగ్ రోల్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత ఉప్పును, పంచదారను, వెన్నను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత గిన్నెపై మూత ఉంచి పిండిని 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. తరువాత ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను, క్యాప్సికం ముక్కలను, క్యాబేజ్ తురుమును వేసి 3 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. తరువాత కొద్దిగా ఉప్పును, పచ్చి మిర్చి ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత మిరియాల పొడిని, చిల్లీ ఫ్లేక్స్ ను వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను వేసి తెల్లసొన, పచ్చ సొన కలిసేలా బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకుని మరోసారి అంతా కలిసేలా బాగా కలిపి కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుంటూ పొడి పిండిని వేస్తూ చపాతీలా రుద్దుకోవాలి. తరువాత పెనం మీద కానీ కళాయి మీద కానీ నూనెను రాసి ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని వేసి కాల్చుకోవాలి. నూనెను వేస్తూ రెండు వైపులా చపాతీని కాల్చుకున్న తరువాత దీనిపై కోడిగుడ్డును వేసి చపాతీ అంతా వచ్చేలా చేసుకోవాలి. ఇలా కోడిగుడ్డును వేసిన 5 సెకన్ల తరువాత చపాతీని మరో వైపుకు తిప్పుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్ని చపాతీలను కాల్చుకున్న తరువాత ఒక్కో చపాతీని తీసుకుంటూ కోడిగుడ్డు వేసిన వైపు పైకి వచ్చేలా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మధ్య భాగంలో వచ్చేలా ముందుగా తయారు చేసిపెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత ఈ కూరగాయలపై కొద్దిగా టమాట కెచప్ ను వేసి గుండ్రండా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చపాతీ ఎగ్ రోల్ తయారవుతుంది. దీనిని టమాట కెచప్ తో పాటు మయనీస్, చీస్ వంటి వాటితో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న చపాతీ ఎగ్ రోల్ ను అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చేసిన ఎగ్ రోల్స్ ను పిల్లలతో పాటుపెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.