Chicken Avakaya : చికెన్, మటన్ అనగానే మనకు ముందుగా వాటితో చేసే కూరలు, బిర్యానీలు వంటివి గుర్తుకు వస్తాయి. కానీ నాన్ వెజ్‌లలో వాస్తవానికి ఎన్నో రకాలు ఉన్నాయి. చాలా వరకు వెరైటీ డిష్‌ల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో చికెన్ ఆవకాయ ఒకటి. అవును.. చికెన్‌ను ఇలా కూడా వండుకోవచ్చు. దీన్ని అన్నం లేదా చపాతీల్లో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే చికెన్ ఆవకాయను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఆవకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – ఒక కిలో, పసుపు – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, జీడిపప్పు – 10, బాదం పప్పు – 10, లవంగాలు – 5, యాలకులు – 5, నిమ్మకాయలు – 5 (రసం తీసి పెట్టుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీస్పూన్లు, కారం – 7 టీస్పూన్లు.
చికెన్ ఆవకాయ తయారీ విధానం..
చికెన్‌ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ముక్కలకి పసుపు, ఉప్పు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసుకుని చికెన్ ముక్కల్లోని నీరంతా పోయి ఎర్రని రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. పాన్‌లో లవంగాలు, యాలకులు పొడిగా వేయించుకుని చల్లారిన తరువాత వాటిల్లో బాదం, జీడిపప్పులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ముందు చికెన్ వేయించిన కడాయిలోనే తగినంత నూనె వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. దీనిలో ముందే మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుని అందులో మాంసం ముక్కలు, కారం, ఉప్పు వేసి పొయ్యి కట్టేయాలి. వేడి చల్లారిన తరువాత నిమ్మరసం వేసి కలుపుకుంటే చికెన్ ఆవకాయ రెడీ అయినట్టే. దీన్ని అన్నంలో అయితే ఎంతో ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతుంది.