Chikkudukaya Pulusu : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో చిక్కుడుకాయలు కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చిక్కుడు కాయలతో మనం వేపుడు, కూర వంటి వాటినే ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఇవేకాకుండా చిక్కుడు కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. నాటు చిక్కుడుకాయలతో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయలతో అందరూ ఇష్టపడేలా సులభంగా పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడు కాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నాటు చిక్కడు కాయలు – పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు – 3( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 5, నూనె – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, బెల్లం తురుము – 3 టీ స్పూన్స్, నీళ్లు – ఒక గ్లాస్.
చిక్కడుకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత చిక్కడు కాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై సాధారణ మూతను ఉంచి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత నీళ్లు, చింతపండు రసం, బెల్లం వేసి కలపాలి. తరువాత కుక్కర్ పై మూతను ఉంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి మరో 5 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుల్లగా, కారంగా, తియ్యగా ఉండే చిక్కుడు కాయ పులుసు తయారవుతుంది. దీనిని ముద్ద పప్పుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయలతో ఎప్పుడూ ఒకే రకం కూరలే కాకుండా అప్పుడప్పుడూ ఇలా పులుసు కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.