Chukka Kura Curry : చుక్కకూర.. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో ఇది కూడా ఒకటి. చుక్కకూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చుక్కకూరతో ఎక్కువగా పప్పు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. వీటితో పాటు చుక్కకూరతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలు వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని 15 నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ చుక్కకూర కూర తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
చుక్కకూర కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాటాలు – 2, తరిగిన చుక్కకూర – చిన్న కట్టలు నాలుగు, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
చుక్కకూర కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత లతాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత గంటెతో వత్తుతూ మరింత మెత్తగా చేసుకోవాలి. తరువాత చుక్కకూర వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి చుక్కకూర మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. చుక్కకూర ఉడికిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చుక్కకూర కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చుక్కకూరతో చేసిన కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.