Dosakaya Kura : మనం దోసకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోసకాయలతో చేసిన కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బరువు తగ్గడంలో, శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దోసకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దోసకాయలతో పచ్చళ్లతో పాటు కూరలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోసకాయలతో కింద చెప్పిన విధంగా చేసే కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా దోసకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన దోసకాయ – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 2, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, నీళ్లు – ఒకటిన్నర టీ గ్లాస్.
దోసకాయ కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత దోసకాయ ముక్కలు, కారం వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి దోసకాయ ముక్కలను మగ్గించాలి. దోసకాయ ముక్కలు సగం మగ్గిన తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మరలా మూత పెట్టి దోసకాయ ముక్కలను పూర్తిగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ కూర తయారవుతుంది. ఈ కూరను అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దోసకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా వండుకుని తినవచ్చు. ఈ విధంగా చేసిన దోసకాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.