Dosakaya Roti Pachadi : దోసకాయ రోటి పచ్చడి.. దోసకాయ ముక్కలు, దోసకాయ గింజలు కలిపి చేసే ఈ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దోసకాయ గింజలు తీసేసి పచ్చడి తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ దోసకాయ గింజలు వేసి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ చేసే దోసకాయ పచ్చడి కంటే ఈ విధంగా తయారు చేసిన పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దీనిని 10 నిమిషాల్లోనే చాలా సులభంగా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ దోసకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 8 నుండి 9, ఎండిన దోస గింజలు – 2 టేబుల్ స్పూన్స్, చింతపండు – ఉసిరికాయంత, తరిగిన దోసకాయ ముక్కలు – పావుకిలో, ఉప్పు – తగినంత, ఉల్లిపాయ – చిన్నది ఒకటి.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 4, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
దోసకాయ రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఇందులో దోసకాయ గింజలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే కళాయిలో ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు రోట్లో వేయించిన దోసకాయ గింజలు, ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత చింతపండు వేసి దంచుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలు వేసి దంచుకోవాలి.
ఈ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయను కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకుని గిన్నె లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ రోటి పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.