Double Ka Meetha Recipe : బ్రెడ్ తో చేసుకోదగిన వంటకం అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది డబుల్ కా మీఠా. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా దీనిని తయారు చేయడం కూడా సులభం. వంటరాని వారు, పిల్లలు కూడా చేసుకునేలా రుచిగా, సులభంగా డబుల్ కా మీఠా ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డబుల్ కా మీఠా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 8, నెయ్యి – 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, పంచదార – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, కాచిచల్లార్చిన పాలు – ఒక కప్పు.
డబుల్ కా మీఠా తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటి చుట్టూ ఉండే నల్లటి అంచులను తీసి వేయాలి. తరువాత ఒక్కో బ్రెడ్ స్లైస్ ను నాలుగు భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడైన తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో బ్రెడ్ ముక్కలను వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. మరలా మరికొద్దిగా నెయ్యిని వేసిమిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా వేయించుకోవాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి.
తరువాత మంటను చిన్నగా చేసి ముందుగా వేయించిన బ్రెడ్ ముక్కలను వేసి పంచదార మిశ్రమంలో వేసి నానబెట్టాలి. బ్రెడ్ ముక్కలు మెత్తగా అయిన తరువాత వాటిని కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. తరువాత పాలను పోసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డబుల్ కా మీఠా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా బ్రెడ్ తో డబుల్ కా మీఠాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఇష్టంగా తింటారు.