Godhuma Rava Upma : మనం గోధుమ రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ రవ్వ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ రవ్వతో ఎక్కువగా తయారు చేసే వంటకాల్లో గోధుమ రవ్వ ఉప్మా కూడా ఒకటి. గోధుమ రవ్వతో చేసే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అయితే తరచూ చేసే పద్దతిలో కాకుండా ఈ ఉప్మాను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. చింతపండు రసం వేసి చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. మరింత రుచిగా గోధుమరవ్వతో ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టీ స్పూన్, గోధుమ రవ్వ – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 2, ఇంగువ – చిటికెడు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, బఠాణీ – పావు కప్పు, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నీళ్లు – 3 కప్పులు, ఉప్పు – తగినంత, బెల్లం తురుము – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గోధుమ రవ్వ ఉప్మా తయారీ విధానం..
ముందుగా చింతపండులో మూడు కప్పుల నీళ్లు పోసి రసాన్ని తీసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోధుమ రవ్వను వేసి వేయించాలి. గోధుమ రవ్వ చక్కగా వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసివేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠాణీ వేసి కలపాలి. తరువాత వీటిపై మూతను ఉంచి ఉల్లిపాయ ముక్కలను మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత ఉప్పు, చింతపండు రసం వేసి కలపాలి.
తరువాత చింతపండు రసం మరిగిన తరువాత వేయించిన గోధుమ రవ్వ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి రవ్వను ఉడికించాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించాలి. రవ్వ పూర్తిగా ఉడికి దగ్గర పడిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధు రవ్వ ఉప్మా తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా ఏదైనా కారం పొడితో తినవచ్చు. ఈ విధంగా గోధుమరవ్వతో చేసిన ఉప్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.