Gongura Pulao : పులావ్ అనగానే మనలో చాలా మంది చికెన్, మటన్ తో చేసే పులావ్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఇవే కాకుండా ఆకుకూర అయినటువంటి గోంగూరతో కూడా మనం పులావ్ ను తయారు చేసుకోవచ్చు. గోంగూరతో మనం ఎక్కువగా పప్పు, పచ్చడి వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. వీటితో పాటు గోంగూరతో పులావ్ కూడా చేయవచ్చు. గోంగూరతో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని చాలా తేలికగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే గోంగూర పులావ్ ను గుంటూరు స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎర్ర గోంగూర – 75 గ్రా., నూనె – అర కప్పు, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, జీడిపప్పు పలుకులు – 15, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన టమాటాలు – 3, నీళ్లు – 2 కప్పుల కంటే కొద్దిగా తక్కువ, ఉప్పు – తగినంత, నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
మసాలా దినుసులు..
బిర్యానీ ఆకులు – 2, అనాస పువ్వులు – 2, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 4, యాలకులు – 4, పత్తర్ ఫూల్ – 2, మరాఠి మొగ్గ – 1, సాజీరా – ఒక టీ స్పూన్.
గోంగూర పులావ్ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత ఈ ఉల్లిపాయలను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. పచ్చిమిర్చి చక్కగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాటాలు, పసుపు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత గోంగూర వేసి కలిపి మూత పెట్టి గోంగూర మెత్తగా అయ్యే వరకు వేయించాలి. గోంగూర మెత్తగా ఉడికిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి నీటిని మరిగించాలి.
నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. తరువాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ను చల్లుకుని మూత పెట్టి 6 నిమిషాల పాటు పెద్ద మంటపై 8 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూత తీయకుండా20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 20 నిమిషాల తరువాత ఈ పులావ్ ను అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పులావ్ తయారవుతుంది. దీనిని రైతా లేదా నాన్ వెజ్ మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూరతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా వండుకుని తినవచ్చు. ఈ గోంగూర పులావ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.